NTV Telugu Site icon

య‌న్టీఆర్… చ‌క్ర‌వ‌ర్తి… 11 వేలు…

న‌ట‌ర‌త్న య‌న్.టి.రామారావు ఏకాద‌శ ప్రియుడు. ప‌ద‌కొండు అంటే ఆయ‌న‌కు ఇష్టం. నిజానికి ఆయ‌న అదృష్ట సంఖ్య తొమ్మిది అయినా, లెక్క‌ల్లో ప‌ద‌కొండుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. త‌మ చిత్రాల‌లో న‌టించిన వారికి, ప‌నిచేసిన సాంకేతిక నిపుణుల‌కు ప‌ద‌కొండు నంబ‌ర్ వ‌చ్చేలా పారితోషికం ఇచ్చేవారు. అదే తీరున తార‌క‌రామా ఫిలిమ్ యూనిట్ ప‌తాకంపై య‌న్టీఆర్ నిర్మించి, న‌టించిన డ్రైవ‌ర్ రాముడు చిత్రానికి ప‌నిచేసిన వారికీ పారితోషికాలు ఇచ్చారు. 1979 ఫిబ్ర‌వ‌రి 2న విడుద‌లైన డ్రైవ‌ర్ రాముడు చిత్రం అఖండ విజ‌యం సాధించింది. ఆ రోజుల్లో కోటి రూపాయ‌లు చూసిన చిత్రంగా నిల‌చింది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే- ఈ సినిమాకు ప‌నిచేసిన ద‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంద్ర‌రావు, సినిమాటోగ్రాఫ‌ర్ కె.ఎస్.ప్ర‌కాశ్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ చ‌క్ర‌వ‌ర్తి వీరిని పిల‌చి య‌న్టీఆర్ పారితోషికాలు ఇవ్వాల‌ని భావించారు. ముగ్గురూ ఒకే రోజు వెళ్ళారు. తొలుత రాఘ‌వేంద్ర‌రావు, ఆ త‌రువాత ప్ర‌కాశ్ పారితోషికాలు తీసుకొని న‌వ్వుతూ ఊ... అప్పారావ్... వెళ్ళూ... అన్నార‌ట‌. కానీ, వారిద్ద‌రి న‌వ్వు చూసిన చ‌క్ర‌వ‌ర్తికి ఏదో అనుమానం క‌లిగింది. ఎందుకురా న‌వ్వుతున్నారు అని అడిగితే లోప‌ల‌కు వెళ్లు…నీకే తెలుస్తుంది అని వారు చెప్పార‌ట‌. స‌రే అంటూ చ‌క్ర‌వ‌ర్తి లోప‌ల య‌న్టీఆర్ ద‌గ్గ‌ర‌కు వెళ్ళారు. ముందుగా వ‌చ్చిన ఆ ఇద్ద‌రికీ చెరో ప‌ద‌కొండు వేల రూపాయలు పారితోషికంగా ఇచ్చార‌ట‌. య‌న్టీఆర్ సొంత సినిమాకు ప‌నిచేస్తే అంతే ఇస్తారు కాబోలు అనుకొని వారు కిమ్మ‌న‌కుండా పుచ్చుకున్నారు. అందుకే బ‌య‌ట‌కు వ‌చ్చి వారు అంత‌లా న‌వ్వార‌న్న మాట‌!

చ‌క్ర‌వ‌ర్తికి కూడా య‌న్టీఆర్ ప‌ద‌కొండు వేల రూపాయ‌ల చెక్కు ఇచ్చార‌ట‌. అయితే అప్ప‌టికే చ‌క్ర‌వ‌ర్తి టాప్ పొజిష‌న్ లో ఉంటూ చిన్న సినిమాల‌కు ల‌క్ష‌, పెద్ద చిత్రాల‌కు ల‌క్ష‌న్న‌ర లేదా రెండు ల‌క్ష‌లు తీసుకుంటున్నారు. అందువ‌ల్ల రామారావు చెక్కు ఇవ్వ‌గానే చ‌క్ర‌వ‌ర్తి అయోమ‌యంలో ప‌డ్డారు. అలాగే కూర్చున్నారు. దాంతో రామారావు, ఏం బ్ర‌ద‌ర్...లెక్క త‌క్కువైందా చెప్పండి ఇస్తాం... అన్నారు. చ‌క్ర‌వ‌ర్తి తాను ఏ సినిమాకు ఎంత తీసుకుంటున్నారో రామారావుకు వివ‌రించార‌ట‌. అందువ‌ల్ల దానిని బ‌ట్టి మీరే ఇవ్వండి అన్న‌గారూ అన్నార‌ట చ‌క్ర‌వ‌ర్తి. `అయితే … మ‌రో చెక్కు కూడా రాసిస్తాం… ఉండండి…“ అని రామారావు చెప్పారు. అయితే చ‌క్ర‌వ‌ర్తి అందుకు అంగీక‌రించ‌కుండా, ఈ చెక్కు కూడా మీ ద‌గ్గ‌రే ఉంచండి…మీ ద‌గ్గ‌ర మా డ‌బ్బులు ఉంటే స్విస్ బ్యాంకులో ఉన్న‌ట్టే అని చాలామంది చెబుతారు. అందువ‌ల్ల ఈ మొత్తం కూడా మీ ద‌గ్గ‌రే ఉంచండి, అవ‌స‌ర‌మైన‌ప్పుడు తీసుకుంటాను అని అన్నారు చ‌క్ర‌వ‌ర్తి. రామారావు కూడా స‌రేన‌న్నారు.

ఆ త‌రువాత య‌న్టీఆర్ సొంత చిత్రాల‌కు చ‌క్ర‌వ‌ర్తి ప‌నిచేసినా, పారితోషికం తీసుకోలేదు. య‌న్టీఆర్ ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత చ‌క్ర‌వ‌ర్తి మ‌ద్రాసులో సొంత ఇల్లు క‌ట్టుకోవాల‌ని భావించారు. ఆ విష‌యం ముఖ్య‌మంత్రికి ఎలా చెప్పాలా అన్న సంశ‌యం క‌లిగింది. అయితే రామారావు మ‌న‌స్త‌త్వం తెలిసిన చ‌క్ర‌వ‌ర్తి మొత్తానికి త‌న ఇంటి విష‌యం ఆయ‌న చెవిన ప‌డేలా చేశారు. య‌న్టీఆర్ మొద‌టి నుంచీ త‌న వ‌ద్ద చ‌క్ర‌వ‌ర్తి దాచుకున్న సొమ్మును ఆయ‌న కోరిన పారితోషికాల ప్ర‌కార‌మే లెక్కలు వేసి,మొత్తం సొమ్మును అంద‌జేశారు. ఈ విష‌యాల‌ను త‌రువాతి కాలంలో చ‌క్ర‌వ‌ర్తి న‌టునిగా సినిమాల్లో న‌టిస్తున్న రోజుల్లో చెప్పేవారు. య‌న్టీఆర్ చిత్రాల‌కు ప‌నిచేస్తే త‌క్కువ మొత్తాలు వ‌స్తాయ‌ని అంటారు. కానీ, ఆయ‌నను అడిగే ధైర్యం లేక‌, ఆయ‌న ఇచ్చినంత పుచ్చుకొని బ‌య‌ట‌కు వ‌చ్చి నిందించరాదు. నేను మాత్రం నా పారితోషికం ఇంత అని చెప్పాను. ఆయ‌న ఏ మాత్రం త‌గ్గించ‌కుండా నేను అడిగినంత‌నే వేసి ఇచ్చారని చ‌క్ర‌వ‌ర్తి చెప్పేవారు. ఏది ఏమైనా య‌న్టీఆర్ సినిమాల‌తోనే టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ఎదిగిన చ‌క్ర‌వ‌ర్తి ఆయ‌న సొంత‌సినిమాల‌కూ అంతే పారితోషికం పుచ్చుకోవ‌డం విశేషం.