Site icon NTV Telugu

Murali Sharma : ‘ఆల్ రౌండర్’ గా మురిపిస్తున్న మురళీ శర్మ!

Murali

Murali

ఇప్పుడొస్తున్న అనేక చిత్రాల్లో తనదైన అభినయంతో ఆకట్టుకుంటున్నారు మురళీ శర్మ! నవ్వించగలరు, ఏడ్పించగలరు, భయపెట్టగలరు – ఒకటేమిటి నవరసాలూ పలికించగలనని నిరూపించుకున్నారు మురళీశర్మ. ఆయన అభినయం తమ సినిమాలకు ఓ ప్లస్ పాయింట్ అని భావించిన సినీజనం మురళీశర్మకు అవకాశాలు కల్పిస్తూ సాగారు. ఆయన కూడా తన దరికి చేరిన ప్రతీపాత్రనూ పండిస్తున్నారు. ప్రస్తుతం తెలుగునాట బిజీ కేరెక్టర్ యాక్టర్స్ లో ఒకరిగా సాగుతున్నారు మురళీ శర్మ.

మురళీ శర్మ 1970 ఆగస్టు 9న గుంటూరులో జన్మించారు. ఆయన తండ్రి మరాఠీ, తల్లి అచ్చ తెలుగు గుంటూరుకు చెందినవారు. మురళి ముంబైలోనే పెరిగారు. అక్కడే డిగ్రీ పూర్తి చేశారు. రోషన్ తనేజా యాక్టింగ్ స్కూల్ లో నటనలో శిక్షణ పొందారు. తెలుగు, హిందీ, మరాఠీ, ఇంగ్లిష్ భాషల్లో పట్టువున్న కారణంగా హిందీ చిత్రాలలోనూ అలరించారు. ఇప్పుడు తెలుగులోనూ ఆకట్టుకుంటున్నారు మురళి. ‘దిల్ విల్ ప్యార్ వ్యార్’లో తొలిసారి తెరపై కనిపించారాయన. తరువాత “రాజ్, మఖ్బూల్, ధూప్, మై హూనా, కల్, చాకోలేట్, తీస్రీ ఆంఖ్, ఢమాల్” వంటి చిత్రాలలో నటించారు. ఆ సమయంలోనే మహేశ్ బాబు ‘అతిథి’ చిత్రంతో తెలుగునాట అడుగు పెట్టారు మురళీ శర్మ. తొలి తెలుగు చిత్రంతోనే బెస్ట్ విలన్ గా నంది అవార్డు సొంతం చేసుకున్నారాయన. “కంత్రి, ఊసరవెల్లి, మిస్టర్ నూకయ్య, అధినాయకుడు, గోపాల గోపాల, ఎవడు” వంటి చిత్రాలలో కీలక పాత్రల్లో నటించారు. ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో తెలుగునాట మురళీశర్మకు మరింత గుర్తింపు లభించింది.

“కృష్ణగాడి వీరప్రేమగాథ, బాబు బంగారం, ఆటాడుకుందాం రా, హైపర్, దువ్వాడ జగన్నాథం, అజ్ఞాతవాసి, టచ్ చేసి చూడు, ఎవరు, ప్రతి రోజూ పండగే, సరిలేరు నీకెవ్వరు” చిత్రాలలో వైవిధ్యమైన పాత్రల్లో కనిపించారు. అన్నిటినీ మించి త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అల…వైకుంఠపురములో’ సినిమాలో మురళీ శర్మ పాత్ర జనాన్ని భలేగా ఆకట్టుకుంది. అటు హిందీ, ఇటు తెలుగు చిత్రాలలో తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు మురళి. ఆయన భార్య అశ్వినీ కల్సేకర్ కూడా నటి. ఆమె అనేక హిందీ చిత్రాలలో నటించారు. ప్రస్తుతం తెలుగు చిత్రాలలోనే మురళీ శర్మ అధికంగా నటిస్తూ ఉండడం విశేషం! కొన్ని తమిళ చిత్రాలలోనూ మురళి అభినయిస్తున్నారు. మునుముందు ఏ తీరున మురళీశర్మ తన వైవిధ్యమైన నటనతో ఆకట్టుకుంటారో చూడాలి.

Exit mobile version