Ranveer Singh: చిత్ర పరిశ్రమ అంతా రక్షా బంధన్ వేడుకలను ఘనంగా జరుపుకొంటుండగా.. బాలీవుడ్ జంట రణవీర్ సింగ్- దీపికా పదుకొనే ల ఇంటికి పోలీసులు రావడం బీ టౌన్ ను షేక్ చేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ను ఆ న్యూడ్ ఫోటోషూట్ వివాదం వదిలేలా కనిపించడం లేదు. మ్యాగజైన్ కోసం తీసిన ఆ ఫోటోషూట్ వలన ఈ స్టార్ హీరో గత కొన్ని రోజులగా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా ఫోటోలకు ఫోజిలిచ్చి షాకివ్వడమే కాకుండా.. వందమంది ముందు కూడా బట్టలు విప్పి ఉండమన్న ఉంటాను అంటూ నిర్మొహమాటంగా చెప్పి ఎంతోమందికి ఆగ్రహం తెప్పించాడు. ఇక ఈ ఫోటోషూట్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక ఈ ఫోటోషూట్ ను ఖండిస్తూ పలువురు కథానాయికలు తమ గొంతును వినిపించారు. మరికొంతమంది ఏకంగా పోలీస్ స్టేషన్ లో అతనిపై కేసు కూడా పెట్టారు. దీంతో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన నగ్న ఫోటోలను పోస్ట్ చేసినందుకు చెంబూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి పోలీసుల ముందు హాజరుకావాలని ఆయనకు సమన్లు జారీ చేయడానికి ముంబై పోలీసుల బృందం శుక్రవారం రణ్‌వీర్ సింగ్ ఇంటికి వెళ్ళింది. అయితే ఆ సమయంలో రణవీర్ ఇంట్లో లేకపోవడంతో ఆగస్టు 16 న అతను వచ్చాకా మళ్లీ వస్తామని తెలిపినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయమై ఈ జంట ఎలా స్పందిస్తారో చూడాలి.
