Site icon NTV Telugu

Mumaith Khan :మరపురాని ముమైత్ ఖాన్ మురిపాలు!

Mumaitha

Mumaitha

ఐటమ్ నంబర్స్ లో నీటుగా, కొన్నిసార్లు నాటుగా, మరికొన్ని సార్లు ఘాటుగా, ఇంకొన్ని సార్లు ఎదుటివారికి దీటుగా చిందేసి కనువిందు చేసిన భామ ముమైత్ ఖాన్. ముఖ్యంగా ముమైత్ తన నడుమును లయబద్ధంగా తిప్పుతూ చేసే ‘బెల్లీ డాన్స్’కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె పాటల కోసమే సినిమాలకు వెళ్ళిన వారూ లేకపోలేదు. ముమైత్ ఐటమ్ సాంగ్స్ లో మురిపించిన తీరును ఇప్పటికీ అభిమానులు తలచుకొని ఆనందిస్తూనే ఉన్నారు. ఇంతలా ఐటమ్స్ లో అలరించిన ముమైత్ కొన్ని చిత్రాలలో కీలక పాత్రల్లోనూ నటించి ఆకట్టుకున్నారు.

ముమైత్ ఖాన్ 1985 సెప్టెంబర్ 1న జన్మించారు. ఆమె పుట్టి, పెరిగింది ముంబైలోనే. ఆమె తల్లి స్వస్థలం చెన్నై. తండ్రి పాకిస్థానీ. మొదటి నుంచీ అందాలతో కనువిందు చేయడానికే సై అంది ముమైత్. దాంతో ఆమెను ఐటమ్ నంబర్స్ మాత్రమే పలకరిస్తూ వచ్చాయి. ‘మున్నాభాయ్ ఎమ్.బి.బి.ఎస్.’తో మంచి గుర్తింపు లభించింది. తరువాత తెలుగు చిత్రసీమలో హరికృష్ణ నటించిన ‘స్వామి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

తమిళ, కన్నడ, బెంగాలీ, ఒడియా భాషల్లో తన నర్తనంతో మత్తెక్కించింది. పూరి జగన్నాథ్ చిత్రాలు – “1 4 3, పోకిరి” ముమైత్ కు తెలుగునాట మంచి గుర్తింపు సంపాదించి పెట్టాయి. “ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే…” అంటూ ‘పోకిరి’లో ముమైత్ చిందేసిన తీరును ఎవరు మాత్రం మరచిపోగలరు. ఇక ‘యోగి’లో “ఓరోరి యోగి…”అంటూ మురిపించిన వైనాన్ని గుర్తు చేసుకొని మరీ చిందులేసే వారున్నారు. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’లో ముమైత్ నడుముతో నాట్యం చేసిన విధానం తరువాతి రోజుల్లో ఎంతోమంది నర్తకీమణులు అనుసరించేలా చేసింది. ఇక ‘మగధీర’లో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరితోనూ స్క్రీన్ షేర్ చేసుకొని అలరించింది ముమైత్. “ఆపరేషన్ దుర్యోధన, మైసమ్మ ఐపియస్, మంగతాయారూ టిఫిన్ సెంటర్, పున్నమినాగు” వంటి చిత్రాలలో ముమైత్ ఖాన్ కీలకమైన పాత్రలు పోషించి మెప్పించారు. ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ కే పరిమితమై ‘ఐటమ్ గాళ్’ గానే గుర్తింపు సంపాదించారు ముమైత్. తెలుగునాటనే ఆమెలోని నటికి మంచి అవకాశాలు లభించాయని చెప్పవచ్చు. ‘హెజా’ అనే తెలుగు చిత్రంలో ఆమె నటిస్తోంది. ఏది ఏమైనా ముమైత్ మురిపించిన తీరును జనం అంత త్వరగా మరచిపోలేరని చెప్పవచ్చు.

Exit mobile version