Mukhachitram: ‘సినిమా బండి’ ఫేమ్ వికాశ్ వశిష్ట, ప్రియా వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘ముఖచిత్రం’. ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మించిన ఈ చిత్రానికి ఎస్కేఎన్ సమర్పకులు. ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ ‘ముఖచిత్రం’కు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. ప్లాస్టిక్ సర్జన్ గా పేరు తెచ్చుకున్న డాక్టర్ రాజ్ కుమార్ కు సంబంధించిన కథ ఇది. ఇష్టపడి వివాహం చేసుకున్నభార్య ఒకవైపు, అతనంటే ప్రాణం పెట్టే ప్రియురాలు మరోవైపు… ఈ ముగ్గురి మధ్య సాగే ఆసక్తికరమైన కథలో ఓ కీలకమైన పాత్రను విశ్వక్ సేన్ చేశాడు.
‘విశ్వక్ సేన్ ఇందులో ప్రత్యేక పాత్రను పోషించడంతో మూవీ రేంజ్ పెరిగింద’ని డెబ్యూ డైరెక్టర్ గంగాధర్ చెప్పారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దీనికి ‘ఎ’ సర్టిఫికెట్ లభించింది. ‘తాము చెప్పాలనుకున్న కథను ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా ప్రేక్షకులకు అందించాలని భావించామని, అందుకే సెన్సార్ వారు ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చార’ని సందీప్ రాజ్ తెలిపారు. ప్రేక్షకుల ఊహకందని ట్విస్టులతో ఈ మూవీ సాగుతుందని, క్లయిమాక్స్ వరకూ అదే టెంపోను దర్శకుడు మెయిన్ టైన్ చేశారని చిత్ర సమర్పకుడు ఎస్కేఎన్ చెప్పారు. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందించిన ‘ముఖచిత్రం’లో సునీల్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడు. డిసెంబర్ 9న జనం ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
