Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్‌బ్యాక్.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?

Agadha1

Agadha1

Agadha Pre Release Event: ఎంఎస్ రాజు దాదాపు 45 ఏళ్ల సినీ ప్రయాణంలో నిర్మాతగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కామాక్షి భాస్కర్ల  లీడ్ రోల్ నటిస్తున్న ‘అగధ’ తో మరో సారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ మధ్య వచ్చిన ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో నిన్న జరిగిన ప్రీ రిలీజ్ వేడుక ఆయన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకునే సందర్భంగానూ మారింది. ప్రముఖుల రాకతో వేదిక కలకళలాడిపోయింది. ఈ వేడుకలో ‘అరుంధతి’ చిత్ర నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాజుతో తన సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రాజు ఎప్పుడూ సినిమా విషయంలో ముందుచూపుతో ఆలోచించే వ్యక్తి అని ప్రశంసించారు. ‘అగధ’ హారర్ సినిమాలలో స్థాయిని దాటి పోతుందని, విజువల్ ప్రజెంటేషన్ అధ్బుతమని పేర్కొన్నారు.

దర్శకుడు బి. గోపాల్ కూడా ఎంఎస్ రాజులో బలమైన కథను ముందుగానే గుర్తించే ప్రత్యేకత ఉందని అన్నారు.  ‘అగధ’ గతంలో వచ్చిన ‘దేవి’ కంటే కూడా పెద్ద విజయాన్ని సాధించే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇక ‘పొలిమెరా’ ఫ్రాంచైజీతో అనుబంధం ఉన్న అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాను మొదటి నుంచే గమనిస్తున్నట్లు తెలిపారు. సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్ తనను ఆశ్చర్యానికి గురిచేసిందని, అది చాలా విభిన్నంగా అనిపించిందని చెప్పారు. కామాక్షి భాస్కర్లకు ఇది కెరీర్ లోనే బెస్ట్ ప్రాజెక్ట్ గా నిలుస్తుందని కొనియాడారు. ఇక కామాక్షి భాస్కర్లకు ‘అగధ’ మరింత కీలకమైన సినిమా కానుంది. తనకు ప్రధాన పాత్ర ఇచ్చినందుకు ఎంఎస్ రాజుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశం తన కెరీర్‌కు బలమైన పునాది వేస్తుందని పేర్కొన్నారు.

మరోవైపు శ్రవణ్ రెడ్డి కూడా ఎంఎస్ రాజు తనను వెబ్ సిరీస్‌లో గుర్తించి, ఆ తర్వాత ‘డర్టీ హరి’లో అవకాశం ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. ‘అగధ’ కూడా ఆయన ఇచ్చిన మరో ముఖ్యమైన అవకాశంగా పేర్కొన్నారు. టీజర్, ట్రైలర్‌కు వచ్చిన స్పందనతో నిర్మాత కాశీ విశాలాక్షి బాలుసు కూడా సినిమాపై నమ్మకం వ్యక్తం చేశారు. షూటింగ్ సమయంలో ఎంఎస్ రాజు చూపించిన అంకితభావం తనకు మరింత విశ్వాసాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ సినిమా సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ సాగుతున్నట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమౌతోంది. దైవిక అంశాలు, మంచి చెడుల మధ్య సంఘర్షణ, అతీంద్రియ నేపథ్యం, విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. అందుకే మామూలు హారర్ కథలకు భిన్నంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే ప్రయత్నంగా ‘అగధ’ కనిపిస్తోంది.

ఎంఎస్ రాజు రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బాలుసు నిర్మించారు. అజయ్ కేఆర్ సమర్పిస్తుండగా, ఎన్వీఎన్ సుబ్బరాజు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు, ట్రైలర్‌కు వచ్చిన స్పందన సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ‘అగధ’ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి. ముఖ్యంగా ఎంఎస్ రాజుకు ఇది నిజంగా గ్రాండ్ కమ్‌బ్యాక్‌గా నిలుస్తుందా, లేక ఆయన చెబుతున్న సూపర్ ఓవర్ విజన్ బాక్సాఫీస్ వద్ద కూడా పనిచేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ చిత్రాల నిర్మాతగా పేరొందిన ఎం.ఎస్. రాజు కెరీర్ ప్రారంభంలో వెంకటేష్‌తో ‘శత్రువు’ (1991) విజయశాంతితో ‘పోలీస్ లాకప్’ (1993) వంటి భారీ విజయాలను అందుకున్నారు. ఆ తర్వాత గ్రాఫిక్స్ వండర్ ‘దేవి’ (1999) చిత్రంతో సరికొత్త ట్రెండ్ సృష్టించిన ఆయన, ఆపై ఉదయ్ కిరణ్‌తో ‘మనసంతా నువ్వే’ (2001), ‘నీ స్నేహం’ (2002) వంటి క్లాసిక్ మ్యూజికల్ హిట్స్ అందించారు. ముఖ్యంగా మహేష్ బాబు కెరీర్‌ను మలుపు తిప్పిన ఇండస్ట్రీ హిట్ ‘ఒక్కడు’ (2003), ప్రభాస్ స్టార్‌డమ్‌ను పెంచిన ‘వర్షం’ (2004), ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ (2005) చిత్రాలతో ఆయన వరుసగా హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్స్ సాధించి ‘సంక్రాంతి రాజు’గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల నిర్మాతగానే కాకుండా దర్శకుడిగా కూడా మారి ‘డర్టీ హరి’ (2020) వంటి బోల్డ్ థ్రిల్లర్‌తో డిజిటల్ పరంగా మంచి విజయాన్ని అందుకున్నారు. ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చిన ఎం.ఎస్. రాజు గత కొంత కాలంగా డీలా పడ్డారు. అయితే ఇప్పుడు వస్తున్న ‘అగధ’ హిట్ అయితే మాత్రం రాజు గారికి ఇండస్ట్రీలో మళ్ళీ కమ్‌బ్యాక్ వచ్చినట్లే.