Mrunal Thakur: సినీ తారలు, క్రికెటర్ల వ్యక్తిగత జీవితాలపై అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. చిన్న సంఘటన కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారిపోతుంది. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు నటి మృణాల్ ఠాకూర్, భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్. ముంబైలోని ఒక ప్రముఖ కేఫ్‌లో వీరిద్దరూ కనిపించిన వీడియో వైరల్ కావడంతో, వీరి మధ్య డేటింగ్ జరుగుతోందా అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తున్నాయి. ముంబైలోని బాంద్రా వెస్ట్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ కేఫ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వైరల్ అవుతున్న వీడియోలో 24 ఏళ్ల యశస్వి జైస్వాల్ కేఫ్ నుంచి బయటకు వస్తుండగా, 33 ఏళ్ల మృణాల్ ఠాకూర్ లోపలే ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే వీడియోలో వీరిద్దరూ కలిసి కనిపించలేదు. ఒకే ప్రదేశంలో ఉన్నారనే కారణంతోనే డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం ప్రారంభమైంది.
ఈ వీడియో వెలుగులోకి వచ్చిన వెంటనే నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు ఇద్దరూ ప్రేమలో ఉన్నారేమోనని వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు ఆధారాలు లేకుండా ఇలాంటి నిర్ణయాలకు రావడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు పర్సనల్ మీట్ కాకపోతే, కమర్షియల్ షూట్‌లో భాగంగా జరిగి ఉండొచ్చని కూడా ఊహిస్తున్నారు. మరోవైపు వీరిద్దరి మధ్య ఉన్న సుమారు 11 ఏళ్ల వయసు తేడాపైనా సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. అయితే ఈ ప్రచారంపై ఇప్పటివరకు మృణాల్ ఠాకూర్ నుంచి గానీ, యశస్వి జైస్వాల్ నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. అందువల్ల ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఊహాగానాల స్థాయిలోనే ఉంది.
మృణాల్ ఠాకూర్ పేరు ఇలాంటి ప్రచారంలో వినిపించడం ఇదే మొదటిసారి కాదు. గత కొద్దిరోజులకు ముందు నటుడు ధనుష్‌తో ఆమె డేటింగ్ చేస్తున్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా పలు కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ వార్తలను ఇద్దరి సన్నిహిత వర్గాలు పూర్తిగా ఖండించాయి. ప్రస్తుతం మృణాల్ తన సినిమా ప్రాజెక్టులతో బిజీగా కొనసాగుతున్నారు. ఇటీవల ఆమె ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ మూవీలో కనిపించగా, చేతిలో మరికొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. మరోవైపు యశస్వి జైస్వాల్ భారత క్రికెట్‌లో అత్యంత ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. 2023లో వెస్టిండీస్‌పై అంతర్జాతీయ అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన ఆయన, మూడు ఫార్మాట్లలోనూ తన స్థానాన్ని సుస్తిరం చేసుకున్నారు. దేశీయ క్రికెట్‌లో ముంబై తరఫున, ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న యశస్వి, త్వరలో శ్రీలంకతో జరగనున్న టెస్ట్ సిరీస్‌లో తిరిగి జట్టులో కనిపించే అవకాశముంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోతో ఇద్దరి పేర్లు వార్తల్లో నిలిచినా, వారి సంబంధంపై ఎలాంటి ఆఫీషియల్ సమాచారం బయటకు రాలేదు. అందువల్ల అభిమానులు కూడా అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ ప్రచారాన్ని కేవలం సోషల్ మీడియా ఊహాగానాలుగానే చూడాల్సి ఉంటుంది.

