‘గీతాంజలి, నిన్నుకోరి’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ కలిసి మరోసారి చిత్ర నిర్మాణానికి పూనుకున్నారు. సందీప్ కిషన్, నేహాశెట్టి జంటగా ‘గల్లీ రౌడీ’ పేరుతో ఓ హాస్యప్రధాన చిత్రాన్ని నిర్మించారు. ఆ మధ్య సందీప్ కిషన్ తో ‘తెనాలి రామకృష్ణ ఎల్.ఎల్.బి.’ చిత్రాన్ని రూపొందించిన జి. నాగేశ్వర రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘గల్లీ రౌడీ’ మూవీ టీజర్ సోమవారం సాయంత్రం విడుదలైంది. ‘గల్లీ రౌడీ’ టీజర్ ను విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా విడుదల చేశాడు. వైజాగ్ నేపథ్యంలో సాగే ఈ హెలేరియస్ కామెడీ చిత్రంలో పొలిటికల్ సెటైర్ డైలాగ్స్ ఉండటం విశేషం. ఈ 2.22 నిమిషాల టీజర్ ఆద్యంతం వినోదాల జల్లు కురిపిస్తూనే ఉంది. మరో విషయం ఏమంటే… ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎంవీవీ సత్యనారాయణ వైసీపీ వైజాగ్ పార్లమెంట్ సభ్యులు. తన గత చిత్రాల్లో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చినట్టుగానే ఆయన ఇందులోనూ ఓ సీన్ లో కనిపించారు. బాబీ సింహా, రాజేంద్రప్రసాద్, వైవా హర్ష, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళీ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. చౌరస్తా రామ్, సాయికార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నీరజా కోన స్టైలిస్ట్!
‘గల్లీ రౌడీ’ టీజర్ తో వినోదాల విందు!
