Mohanlal: ఏనుగు దంతాల వివాదంలో కొత్త మలుపు.. 10 దంతాలు, 13 ఐవరీ విగ్రహాల వివరాలు వెల్లడించిన మోహన్‌లాల్!

Mohanlal

Mohanlal

Mohanlal: మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ చుట్టూ గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఏనుగు దంతాల వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో కోర్టు విచారణను ఎదుర్కొంటున్న ఆయన, తాజాగా కేరళ ప్రభుత్వం తీసుకొచ్చిన వైల్డ్‌లైఫ్ అమ్నెస్టీ పథకం కింద తన వద్ద ఉన్న ఏనుగు దంతాలు, ఐవరీతో తయారైన విగ్రహాల వివరాలను అటవీ శాఖకు అధికారికంగా సమర్పించారు. ఈ తాజా డిక్లరేషన్‌తో ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. మలయాళ చిత్రసీమలో ‘కంప్లీట్ యాక్టర్’గా గుర్తింపు పొందిన మోహన్‌లాల్‌పై చట్టవిరుద్ధంగా ఏనుగు దంతాలు ఇంట్లో ఉంచుకున్నారనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. తాజాగా ఆయన కేరళ అటవీ శాఖకు సమర్పించిన వివరాల ప్రకారం, తన వద్ద మొత్తం 10 ఏనుగు దంతాలు, 13 ఐవరీ విగ్రహాలు ఉన్నట్లు వెల్లడించారు. గతంలో కేవలం నాలుగు ఏనుగు దంతాల వివరాలు మాత్రమే నమోదు చేయగా, ఇప్పుడు మరో ఆరు దంతాలతో పాటు ఐవరీతో తయారైన పలు విగ్రహాలను కూడా అధికారికంగా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అటవీ శాఖ అధికారుల సమాచారం ప్రకారం, ఈ ఐవరీ విగ్రహాల్లో శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వంటి హిందూ దేవతల ప్రతిమలు ఉన్నాయి. ఈ విగ్రహాల మొత్తం బరువు సుమారు 46 కిలోల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇవన్నీ తనకు వారసత్వంగా వచ్చాయని, మరికొన్ని బహుమతుల రూపంలో లభించాయని మోహన్‌లాల్ మొదటి నుంచీ వాదిస్తున్నారు. ఈ వివాదానికి మూలం 2011లో జరిగిన ఆదాయపు పన్ను శాఖ దాడులు. ఆ సమయంలో మోహన్‌లాల్ నివాసంలో అనుమతులు లేని ఏనుగు దంతాలు, విలువైన కళాఖండాలు బయటపడటంతో అటవీ శాఖ కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి ఈ వ్యవహారం కోర్టుల్లో కొనసాగుతోంది. కేసు నుంచి మోహన్‌లాల్‌కు ఊరటనివ్వాలని కేరళ ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ, ట్రయల్ కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. అనంతరం కేరళ హైకోర్టు కూడా అదే నిర్ణయాన్ని సమర్థిస్తూ క్రిమినల్ విచారణ కొనసాగాల్సిందేనని స్పష్టం చేసింది. అంతేకాకుండా గతంలో ప్రభుత్వం జారీ చేసిన యాజమాన్య ధ్రువపత్రాలను కూడా రద్దు చేసింది.

ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైల్డ్‌లైఫ్ అమ్నెస్టీ పథకం ప్రకారం, అనుమతులు లేని వన్యప్రాణుల సంబంధిత వస్తువులను స్వచ్ఛందంగా ప్రకటిస్తే వాటిని చట్టబద్ధం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మోహన్‌లాల్ తన వద్ద ఉన్న అన్ని వస్తువుల వివరాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వస్తువుల మూలం ఏమిటి ? అవి చట్టబద్ధంగానే లభించాయా? అన్నది నిర్ధారించేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ డిక్లరేషన్‌తో కేసు కొత్త దశలోకి ప్రవేశించింది. మోహన్‌లాల్ వెల్లడించిన వివరాలు, డీఎన్ఏ పరీక్షల ఫలితాలు, కోర్టు విచారణ తదుపరి దశలో ఈ కేసు భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. దీంతో ఈ అంశంపై సినీ వర్గాలతో పాటు న్యాయ, రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.