Operation Ganga: మోహన్‌లాల్ నుంచి మరో ఆసక్తికరమైన సినిమా వచ్చేందుకు సిద్ధమవుతోంది. మలయాళ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక కథలకు, భారీ సినిమాలకు కేరాఫ్‌గా అడ్రెస్ గా మారుతున్న ఈ సీనియర్ స్టార్ తన కొత్త ప్రాజెక్ట్‌ను ఈరోజు ఆఫీషియల్ గా ప్రకటించారు. ‘మెప్పాడియన్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై జాతీయ అవార్డు అందుకున్న విష్ణు మోహన్‌తో మోహన్‌లాల్ తొలిసారి కలిసి పనిచేస్తున్నారు. ఇంతకాలం L367 అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పుడు ‘ఆపరేషన్ గంగా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మోహన్‌లాల్ పంచుకున్నారు. పోస్టర్‌లో ఒక భారీ మహిళా విగ్రహం కనిపిస్తుంది. ఒక చేతిలో కత్తి, మరో చేతిలో డాలు పట్టుకున్న ఆ విగ్రహం చుట్టూ దట్టమైన మేఘాలు కనిపిస్తుండగా, దాని పక్కనే ఒక యుద్ధ విమానం కనిపిస్తుంది. పోస్టర్‌పై ‘ఆపరేషన్ గంగా’ అనే టైటిల్‌తో పాటు ‘ఎ నేషన్స్ ప్రామిస్’ అనే ట్యాగ్‌లైన్ ఉండటం మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారతీయులను రక్షించిన మిషన్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్‌లో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో కనిపించనుండగా, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. అందాల భామ భాగ్యశ్రీ బోర్సే, తమిళ నటుడు పార్థిబన్, నటుడు ఆదిల్ హుస్సేన్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ‘ధురంధర్’ సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శశ్వత్ సచ్‌దేవ్ ఈ మూవీకి సంగీతం అందించనున్నారు.
దర్శకుడు విష్ణు మోహన్ విషయానికి వస్తే ఆయనకు ఇది రెండో ఫీచర్ సినిమా. 2022లో విడుదలైన ‘మెప్పాడియన్’తో దర్శకుడిగా పరిచయమైన ఆయన తొలి సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు విష్ణు మోహన్‌కు జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తొలి దర్శకుడిగా అవార్డును అందించింది. ఇప్పుడు రెండో సినిమాకే మోహన్‌లాల్ లాంటి సీనియర్ స్టార్‌తో భారీ స్థాయి కథను తెరకెక్కించే అవకాశం రావడం విశేషం.
ప్రస్తుతం ‘ఆపరేషన్ గంగా’ కథకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ గోప్యంగానే ఉంచుతున్నారు. మోహన్‌లాల్ ఏ పాత్రలో కనిపిస్తారు, అర్జున్ రాంపాల్ పాత్ర ఏమిటి, భాగ్యశ్రీ బోర్సేకు ఎలాంటి క్యారెక్టర్ దక్కింది, కథకు అసలు ఆపరేషన్ గంగాతో ఎంతవరకు సంబంధం ఉంది అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే షూటింగ్ షెడ్యూల్, ఇతర నటీనటులు, రిలీజ్ డేట్ వంటి వివరాలను కూడా త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.
ఇక మోహన్‌లాల్ ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత బిజీ ఫేజ్‌లో ఉన్నారు. ఇటీవలే ఆయన ఒకేసారి ఏడుగురు ప్రముఖ దర్శకులతో వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లను అధికారికంగా ప్రకటించి సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించారు. వీటిలో విష్ణు మోహన్ ‘ఆపరేషన్ గంగా’ కూడా ఒకటి. దీనితో పాటు తరుణ్ మూర్తి దర్శకత్వంలో మీరా జాస్మిన్‌తో కలిసి మోహన్‌లాల్ నటిస్తున్న క్రైమ్ యాక్షన్-కామెడీ డ్రామా చిత్రం ‘అతిమనోహరం’ 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. ఇవే కాకుండా ప్రముఖ దర్శకుడు దిలీష్ పోతన్ తెరకెక్కిస్తున్న వినూత్న చిత్రం ‘నెడుంకండం మిరాకిల్’, సత్యన్ అంతికాడ్ కుమారుడైన అనూప్ సత్యన్ దర్శకత్వంలో రాబోతున్న సరికొత్త యాక్షన్-కామెడీ చిత్రం లైన్-అప్‌లో ఉన్నాయి.
అలాగే మోహన్‌లాల్‌కు ఎన్నో క్లాసిక్ హిట్స్ ఇచ్చిన ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాను మోహన్‌లాల్ హీరోగానే ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు ‘దృశ్యం’ ఫేమ్ జీతూ జోసెఫ్ చిత్రం, సత్యన్ అంతికాడ్‌తో ఒక ఫ్యామిలీ డ్రామా చేయడానికి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేవలం సోలో సినిమాలే కాకుండా రజనీకాంత్ ‘జైలర్ 2’ లో ‘మ్యాథ్యూ’ పాత్రలో, పృథ్విరాజ్ సుకుమారన్ ‘ఖలీఫా’ చిత్రంలో ప్రత్యేకమైన అతిథి పాత్రల్లో నటించి మోహన్‌లాల్ ప్రేక్షకులను అలరించబోతున్నారు.

