NTV Telugu Site icon

Mohan Babu: నలభై ఏళ్ళ మోహన్ బాబు ‘ప్రతిజ్ఞ’

Mohan Babu

Mohan Babu

భారతదేశంలోనే అత్యధిక చిత్రాలు నిర్మించి, నటించిన నటనిర్మాతగా మోహన్ బాబు తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు. తన కూతురు లక్ష్మీప్రసన్న పేరిట 1982లో ‘శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్’ సంస్థను నెలకొల్పి, తరువాత దాదాపు యాభై చిత్రాలను మోహన్ బాబు నిర్మించారు. ‘శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్’ సంస్థకు బీజం వేసిన చిత్రం ‘ప్రతిజ్ఞ’. మోహన్ బాబు హీరోగా నటిస్తూ నిర్మించిన తొలి చిత్రమిది. బోయిన సుబ్బారావు దర్శకత్వంలో ‘ప్రతిజ్ఞ’ తెరకెక్కింది. 1982 జూలై 2న ‘ప్రతిజ్ఞ’ చిత్రం విడుదలయింది.

‘ప్రతిజ్ఞ’ కథ ఏమిటంటే – ఓ ఊరిలో నాగరాజు అనే ధనికుడు తిరుగులేకుండా పెత్తనం సాగిస్తూ ఉంటాడు. కొడుకు శేషగిరి చేసే తప్పుడు పనులకు వత్తాసు పలుకడం తప్ప ఏమీ చేయని దుర్మార్గుడు. భూషయ్య కొడుకు భరత్ వచ్చి, తన పొలంలో పంటవేసుకొని కోసుకుంటున్న నాగరాజు, శేషగిరిని అడ్డుకుంటాడు. నాగరాజు కూతురు రోజా తన ధనగర్వం చూపించబోతే, ఆమె టెక్కు దిగేలా చేస్తాడు భరత్. రోజా డాక్టర్ చదివి, ఊళ్ళోనే ప్రాక్టీస్ పెడుతుంది. పేదవారికి సేవ చేయమని భరత్ చెబుతాడు. అందుకు నాగరాజు ససేమిరా అంటాడు. భరత్ చెల్లెలిని శేషగిరి మానభంగం చేస్తాడు. శేషగిరిని భరత్ చంపబోతాడు. భరత్ తల్లి పార్వతమ్మ వాడిని వదిలేసి, అసలైన పగతీర్చుకోమని చెబుతుంది. కొన్నేళ్ళ క్రితం నాగరాజు తన భర్తను చంపాడని గుర్తు చేస్తుంది. తన తండ్రి పగ తీర్చడం కోసం తల్లి దగ్గర ప్రతిజ్ఞ చేస్తాడు భరత్. డాక్టర్ రోజా, భరత్ కోరినట్టుగా పేదవారికి ఉచిత వైద్యం చేస్తూ ఉంటుంది. భరత్ ను చంపించాలని నాగరాజు పలు ప్రయత్నాలు చేస్తాడు. ఓ సారి భరత్ కు గాయమవుతుంది. డాక్టర్ రోజా వైద్యం చేస్తుంది. వారి మనసులు కలుస్తాయి. తరువాత నాగరాజును అతనికి వత్తాసు పలికే పూజారి, కరణం, మల్లయ్యను చితక బాదినట్టుగా కేసు రాసి భరత్ ను జైలుకు పంపిస్తారు. తప్పించుకు వచ్చి అందరి భరతం పడతాడు భరత్. ఆ పోట్లాటలో ఊబిలో ఇరుక్కుపోతాడు శేషగిరి. అదే ఊబిలో ఎంతోమంది ప్రాణాలు తీసి ఉంటాడు నాగరాజు. కొడుకు ప్రాణాలు కాపాడమని భరత్ తల్లి పార్వతమ్మ కాళ్ళు పట్టుకుంటాడు నాగరాజు. అన్యాయమై పోయిన చెల్లెలి బ్రతుకు బాగు కోసం శేషగిరిని రక్షిస్తాడు భరత్. నాగరాజు తన కొడుక్కి భరత్ చెల్లెలిని ఇచ్చి, భరత్ కు తన కూతురు రోజానిచ్చి పెళ్ళి చేయమని పార్వతమ్మను కోరి, తానుగా జైలుకు వెళతాడు.

కవిత నాయికగా నటించిన ఈ చిత్రంలో సత్యనారాయణ, గిరిబాబు, త్యాగరాజు, కాంతారావు, ధూళిపాల, కన్నడ ప్రభాకర్, సాక్షి రంగారావు, మాడా, పుష్పలత, ముచ్చర్ల అరుణ, కృష్ణవేణి, కల్పనా రాయ్, జయవాణి, రూప, నారాయణమూర్తి తదితరులు నటించారు. ఇందులో మాస్టర్ విష్ణువర్ధన్ బాబు తొలిసారి తెరపై కనిపించడం విశేషం! ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే యమ్.డి.సుందర్ సమకూర్చారు. సత్యానంద్ మాటలు, ఆచార్య ఆత్రేయ పాటలు పలికించారు. సత్యం స్వరకల్పన చేశారు. ఇందులోని “గొప్పోళ్ళ చిన్నది…”, “తప్పెట్లు తాళాలు…బాకాలు..”, “ఎర్రగా ఉంటాది కుర్రది..”, “చారడంత కళ్ళు విప్పి…”, “సవాల్…నీకూ నాకూ సవాల్…” అంటూ సాగే పాటలు అలరించాయి.

‘ప్రతిజ్ఞ’ చిత్రాన్ని మోహన్ బాబు తన భార్య, దివంగత విద్యాదేవికి అంకితమిచ్చారు. తన గురువు దాసరిని ‘సర్దార్’ అంటూ సంబోధిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తరువాత కృతజ్ఞతలు తెలిపిన వారిలో మొదటగా అప్పటి మినిస్టర్ ఆఫ్ మైనర్ ఇరిగేషన్ గా ఉన్న చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇక ఈ సినిమా ప్రారంభోత్సవానికి నటరత్న యన్టీఆర్ ను ఆహ్వానించారు మోహన్ బాబు. ఆ సమయంలో యన్టీఆర్ ‘బొబ్బిలిపులి’లో నటిస్తున్నారు. అదే గెటప్ తో వెళ్ళి కొబ్బరి కాయ కొట్టి శుభం పలికారు రామారావు. ఆయన ఆశీస్సుల మహాత్మ్యమేమో కానీ, దేశంలోనే అత్యధిక చిత్రాలు నిర్మించిన నటనిర్మాతగా మోహన్ బాబు నిలిచారు. మరో విశేషమేమంటే, ‘ప్రతిజ్ఞ’ విడుదలైన వారానికి అంటే జూలై 9న 1982లో యన్టీఆర్, దాసరి కాంబోలో వచ్చిన ‘బొబ్బిలిపులి’ సంచలన విజయం సాధించింది. ఆ సినిమా దాటికి కూడా తట్టుకొని ‘ప్రతిజ్ఞ’ మోహన్ బాబుకు లాభాలు సంపాదించి పెట్టింది. మద్రాసులో ‘ప్రతిజ్ఞ’ వందరోజుల వేడుకను కూడా నిర్వహించారు.