NTV Telugu Site icon

Mishan Impossible Review: మిషన్ ఇంపాజిబుల్

mishan impossible

mishan impossible

డెబ్యూ మూవీ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు డైరెక్టర్ స్వరూప్ ఆర్.ఎస్.జె. దాంతో సహజంగానే అతని సెకండ్ ఫిల్మ్ ‘మిషన్ ఇంపాజిబుల్’పై అంచనాలు పెరిగిపోయాయి. జాతీయ స్థాయిలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న తాప్సీతో పాటు రవీంద్ర విజయ్, హరీశ్ పేరడి, విషబ్ శెట్టి లాంటి పరభాషా నటులూ ఈ ప్రాజెక్ట్ తో జత కావడంవల్ల సమ్ థింగ్ స్పెషల్ గా ‘మిషన్ ఇంపాజిబుల్’ ఉండబోతోందనే ఆశలు ఏర్పడ్డాయి. కానీ దర్శకుడు స్వరూప్ ద్వితీయ విఘ్నాన్ని దాటలేకపోయాడు.

శైలజ ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. చైల్డ్ ట్రాఫిక్ మీద దృష్టి పెట్టి దాన్ని అరికట్టడం కోసం కృషి చేస్తుంటుంది. ఆమెకు విక్రమ్, ఎస్.ఐ. సతీశ్ సహరిస్తుంటారు. రాజకీయ నాయకుల నుండి ఒకప్పుడు సాయం పొంది, ఆ తర్వాత తన నేర సామ్రాజ్యాన్ని విస్తరింప చేసి, తానే రాజకీయ నేతలకు సాయం చేసే స్థాయికి ఎదిగిన రామ్ శెట్టి చైల్డ్ ట్రాఫికింగ్ కూడా చేస్తుంటాడు. ఈ విషయం శైలజ దృష్టిలో పడుతుంది. ఇదిలా ఉంటే… చిత్తూరు జిల్లాలోని వడమాల పేటకు చెందిన రఘుపతి, రాఘవ, రాజారాం అనే ముగ్గురు పిల్లలు ముంబై వెళ్ళి దావూద్ ఇబ్రహీంను పట్టుకుని ప్రైజ్ మనీ గా ప్రభుత్వం ఇచ్చే యాభై లక్షల రూపాయలను సొంతం చేసుకోవాలని కలలు కంటూ ఉంటారు. అందులో రఘపతికి దర్శకుడు కావాలనే పిచ్చి. రాఘవకు కౌన్ బనేగా కరోడ్ పతి కి వెళ్ళాలనే కోరిక. ఇక మూడోవాడైన రాజారాంకు క్రికెటర్ కావాలని ఆశ. ఈ ముగ్గురూ ఇంట్లో చెప్పకుండా ముంబై వెళ్ళాలని బయలుదేరి బెంగళూరులో దిగుతారు. అక్కడ అనుకోకుండా వీరికి శైలజ తారసపడుతుంది. ఈ పిల్లల సాయంతో ఆమె రామ్ శెట్టి చైల్ట్ ట్రాఫికింగ్ వ్యవహారానికి ఎలా చెక్ పెట్టిందన్నదే మిగతా కథ.

తాప్సీకి ఇప్పుడున్న ఇమేజ్ తో పోల్చితే, ఇది సరైన పాత్ర కాదు. సినిమా ప్రధమార్థంలో రెండు మూడు సీన్స్ లోనే ఆమె కనిపిస్తుంది. అలానే ద్వితీయార్థంలో ప్లానింగ్ ఆమెదే అయినా దాన్ని ఆచరణలో పెట్టేది పిల్లలు కావడంతో వాళ్ళదే డామినేషన్ అంతా. తాప్సీ లుక్ కాస్తంత డిఫరెంట్ గా ఉన్నా, ఆమె నుండి గొప్ప నటనను దర్శకుడు తీసుకోలేకపోయాడు. ఆమె కూడా చాలా బలహీనంగా కనిపించింది. ఇక ఆమె పక్కనే ఉండే విక్రమ్ పాత్రధారి రవీంద్ర విజయ్ తో సొంత డబ్బింగ్ చెప్పించడం మానిపిస్తే బాగుంటుంది. ఆ తమిళ యాసను భరించడం కష్టం! మలయాళ నటుడు హరీశ్ పేరడి గెటప్ ఆకట్టుకునేలా ఉంది. కానీ ఆయన నుండి కూడా గొప్ప నటన అయితే తీసుకోలేదు. ఒకటి రెండు సన్నివేశాల్లో హరీశ్ పేరడీ నటన కంటే కెమెరాలో డిఫరెంట్ యాంగిల్స్ లో అతని చూపించిన విధానమే ఆకట్టుకుంది. ముఖ్యంగా టాప్ యాంగిల్ షాట్స్! సుహాస్, హర్షవర్థన్, వైవా హర్ష, ‘సత్యం’ రాజేశ్‌, మధుసూదన్, సందీప్ రాజ్ వంటి వాళ్ళు గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చారు. కిశోర్ కుమార్ పొలిమేర, శరణ్య ప్రదీప్ తో మరికొందరు పిల్లల తల్లిదండ్రులుగా నటించారు. వీరందరి నటన బాగుంది. అయితే ముఖ్యంగా మెచ్చుకోవాల్సింది రఘుపతి, రాఘవ, రాజారాం పాత్రలు పోషించిన హర్ష రోషన్, భాను ప్రకాశన్, జయతీర్థ లను! ముగ్గురూ చాలా చలాకీగా నటించారు. వారిలోని అమాయకత్వం, ఏదైనా సాధించగలమనే తెగింపు, తప్పో ఒప్పో తెలియకపోయినా ప్రదర్శించే ధైర్యం ఇవన్నీ బాగా చూపించారు. అయితే… క్లయిమాక్స్ లో సైతం వారిని దావుద్ ను పోలీసులకు అప్పగించామనే భ్రమలో ఉంచేయడం సమంజసంగా లేదు!

తొలి చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’లో ఆర్గాన్ ట్రేడ్ ను ప్రధానాంశంగా తీసుకుని వినోదాత్మకంగా తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు స్వరూప్. ఈ చిత్రంలో చైల్డ్ ట్రాఫికింగ్ ను ఎంపిక చేసుకున్నాడు. తీసుకున్న అంశం గొప్పదే అయినా దాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో తడబడ్డాడు. పిల్లలతో కామెడీగా కథను నడపాలని చూసినా అది ఆకట్టుకోలేకపోయింది. ప్రధమార్థం కాస్తంత సరదాగా సాగినా ద్వితీయార్థంకు వచ్చే సరికీ మూవీ సీరియస్ టర్న్ తీసుకుంది. పిల్లలతో తాప్సీ కథ నడిపించడం పెద్దంత కన్వెన్సింగ్ గా లేకపోయింది. మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ అధినేతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి రాజీపడకుండా సినిమాను నిర్మించారు. మార్క్ కె రాబిన్ స్వరాలు భిన్నంగా ఉన్నాయి. నేపథ్య సంగీతమూ బాగుంది. దీపక్ సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. మాటలూ వినోదాత్మకంగా ఉన్నాయి. అయితే కథ, కథనాలు మెప్పించే విధంగా లేకపోవడం ఈ చిత్రానికి సంబంధించి మెయిన్ మైనెస్!

రేటింగ్: 2.25/ 5

ప్లస్ పాయింట్స్
ఆకట్టుకునే పిల్లల నటన
ఎంపిక చేసుకున్న అంశం
నేపథ్య సంగీతం, సంభాషణలు

మైనెస్ పాయింట్స్
పేలవమైన కథనం
నిరాశ పరిచే క్లైమాక్స్

ట్యాగ్ లైన్: మిషన్ ఫెయిల్డ్!