Site icon NTV Telugu

BACK TO BACK: ‘ప్లాన్ ఎ- ప్లాన్ బి’తో మిల్కీబ్యూటీ రెడీ!

Thamana

Thamana

మిల్కీ బ్యూటీ తమన్నాకు ప్రస్తుతం ఎదురుగాలి వీస్తోంది. ఆమె స్పెషల్ సాంగ్ చేసిన ‘గని’ సినిమా భారీ పరాజయాన్ని మూటకట్టుకోగా, మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 3’ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయింది. ఇక విడుదలకు సిద్థంగా ఉన్న ‘గుర్తుందా శీతాకాలం’మూవీ కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే… చిరంజీవి లాంటి సీనియర్ స్టార్ పక్కన ‘భోళా శంకర్’ మూవీలో ఛాన్స్ దక్కడం ఆమెకు లభించిన వరంగా భావించాలి. హిందీ సినిమాల్లోనూ తనదైన ముద్రను గాఢంగా వేసుకోలేకపోయిన తమన్నా… ఓ మంచి పొజిషన్ కోసం అక్కడ స్ట్రగుల్ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంతో వచ్చే నెలలో ఆమె నటించిన రెండు సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ ఓటీటీలో రాబోతున్నాయి. అందులో మొదటిది ‘బబ్లీ బౌన్సర్’. ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ తెరకెక్కించిన ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో తమన్నా బౌన్సర్ పాత్రను చేస్తోంది. ఈ మూవీ సెప్టెంబర్ 23న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

 

ఇక తమన్నా నటించిన మరో సినిమా ‘ప్లాన్ ఎ ప్లాన్ బి’ మూవీ ట్రైలర్ ను సోమవారం విడుదల చేశారు. అందులో ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 30న స్ట్రీమింగ్ చేస్తున్నట్టు తెలిపారు. రితేష్ దేశ్ ముఖ్, తమన్నా జంటగా నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ మూవీని శశాంక్ ఘోష్ డైరెక్ట్ చేశారు. ఇందులో డైవర్స్ లాయర్ గా రితేష్, మ్యాచ్ మేకర్ గా తమన్నా నటిస్తున్నారు. ఒక్కటిగా ఉండే భార్యభర్తలను విడగొట్టే పని లాయర్ కౌస్థభ్ పని అయితే… విడివిడిగా ఉండేవారిని పెళ్ళి పేరుతో ఒకటి చేసే పని నిరాలీ ఓరా ది! డిఫరెంట్ అండ్ ఆపోజిట్ ప్రొఫెషన్స్ లో ఉన్న ఈ లాయర్, ఆ మ్యాచ్ మేకర్ మధ్య ప్రేమ ఎలా చిగురించిందన్నదే ‘ప్లాన్ ఎ – ప్లాన్ బి’ కథ! మరి థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్న తమన్నా సినిమాలు… ఓటీటీలో అయినా వ్యూవర్స్ ను అట్రాక్ట్ చేస్తాయేమో చూడాలి.

 

 

 

 

 

Exit mobile version