God Father: హైదరాబాద్ నోవాటెల్ హోటల్‌లో శనివారం రాత్రి జరిగిన గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. సినిమా బాగా తీసిన తమ కాన్ఫిడెంట్ తగ్గించేలా మీడియాలో వస్తున్న వార్తలు చిరాకు కల్గిస్తున్నాయని అన్నారు. తామేం చేయాలో కూడా మీడియా నిర్ణయిస్తుంటే ఎలా అని ప్రశ్నించారు. సినిమాను ఎప్పుడు ప్రమోట్ చేయాలో.. ఎప్పుడు హైలెట్ చేయాలో కూడా మీడియా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గాడ్ ఫాదర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో వర్షం పడినప్పటికీ తన స్పీచ్ కొనసాగించానని, ఆపితే మీడియా వాళ్లు ఎక్కడ కంపు చేస్తారేమోననే భయంతో ఆ కార్యక్రమానికి బ్రేక్ రాకుండా చూసుకున్నానని చిరంజీవి తెలిపారు. ఈసినిమా రిలీజ్ అయిన తరువాత ప్రతి మీడియా బాగా రాసిందని.. వాళ్లకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు.
అటు గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ అయిన ఉదయం నుంచి సూపర్ అంటూ ఫోన్ కాల్స్ వచ్చాయని.. చాలా కాలం తరువాత ఇంద్ర, ఠాగూర్.. ఆ రేంజ్ సినిమా అని ప్రతి ఒక్కరూ చెపుతున్నారని చిరంజీవి చెప్పారు. థియేటర్లకు ఆడియన్స్ వచ్చే పరిస్థితి లేదని.. వాళ్లు ఓటీటీకి అలవాటు పడ్డారని చెపుతుంటే.. కంటెంట్ బాగుంటే వస్తారని చెప్పానని తెలిపారు. ఈ సినిమా కంటెంట్ కోసం కష్టపడి పనిచేశామని.. అందుకే ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ హిట్ చేశారన్నారు. ముఖ్యంగా మహిళలు బాగా ఆదరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ రెమ్యునరేషన్ కోసం పని చేయలేదని.. సూపర్ హిట్ ఇవ్వాలని ప్రాణం పెట్టి పనిచేశారని చిరు కొనియాడారు. తమన్ 30 రోజులకు పైగా సరైన నిద్రపోకుండా వర్క్ చేశాడన్నారు. సత్యదేవ్ మీద తాము ఏ నమ్మకం పెట్టుకున్నామో దానికి పదింతలు నటించాడన్నారు. తన కెరీర్‌లో అత్యద్భుతమైన సినిమాలు 10, 15 సినిమాలు ఉంటే అందులో గాడ్ ఫాదర్ ఉంటుందన్నారు. అప్పుడు తనకు ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టడానికి ఎడిటర్ మోహన్ హిట్లర్ ఇచ్చారని.. ఇప్పుడు గాడ్ ఫాదర్ ఇచ్చి సక్సెస్‌కు కారకులు అయ్యారని చిరు అన్నారు.
Read Also: Mohan Raja: స్టోరీలో మెగాస్టార్ వేలు పెడతారని అన్నవాళ్లను కొట్టేస్తా..!!
తమ మీద ప్రేమతో సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో నటించారని.. ఆయనకు థ్యాంక్స్ అని చెప్పారు. ఆయనకు పెద్ద అమౌంట్ ఆఫర్ చేస్తే.. చిరంజీవి, చరణ్ మీద వున్న ప్రేమను డబ్బుతో కొలుస్తావా అని మేనేజర్‌ను తిట్టారని చిరంజీవి వెల్లడించారు. రామ్ చరణ్ త్వరలోనే సల్మాన్‌కు అందుకు తగిన ప్రతిఫలం ఏదో ఒక రూపంలో తప్పకుండా ఇస్తాడన్నారు. ఎప్పుడైనా ఒక బ్రెయిన్ మీద రెండు.. రెండు మీద మూడు గొప్పవి అన్నారు. తనకు వచ్చే ప్రతి పొగడ్త పన్నీరు లాంటిది.. అది చల్లుకోవాలి కానీ తాగకూడదన్నారు. తన తదుపరి సినిమా బాబీ చేస్తున్నాడని.. ఈ మూవీలో తన పాత్ర రౌడీ అల్లుడు లాంటి మాస్‌గా ఉంటుందని.. తరువాత మెహర్ రమేష్ సినిమా కూడా పవర్ ఫుల్‌గానే ఉంటుందని చెప్పారు.