చిత్రసీమలో అడుగుపెట్టగానే ‘తండ్రికి తగ్గ తనయుడు’ అనిపించుకున్నారు రామ్ చరణ్.
ఇప్పుడు ‘ట్రిపుల్ ఆర్’తో గ్లోబల్ స్టార్ గానూ జేజేలు అందుకుంటున్నారు చరణ్. నటనిర్మాతగానూ తన అభిరుచిని చాటుకుంటున్న రామ్ చరణ్, ఈ నాటి నటవారసుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు రామ్ చరణ్. మరో నటవారసుడు జూనియర్ యన్టీఆర్ తో కలసి ఈ మధ్యకాలంలో రూపొందిన అసలు సిసలు మల్టీస్టారర్ ‘ట్రిపుల్ ఆర్’లో నటించారు చెర్రీ. ఇందులో తారక్ తో కలసి చెర్రీ చిందేసిన తీరు ప్రేక్షకులకు కనువిందు చేసింది. “నాటు నాటు…” పాట నేడు యావత్ ప్రపంచంలోని సినీఫ్యాన్స్ ను మురిపిస్తోంది. భాషాభేదం లేకుండా ఎంతోమంది “నాటు నాటు..”కు చిందులు వేస్తున్నారు. ఆ పాటలో అలరించిన రామ్ చరణ్ నేడు గ్లోబల్ స్టార్ గా నిలవడమే కాదు, అన్నీ సమకూరితే హాలీవుడ్ లోనూ నటించే అవకాశం ఉంది.
రామ్ చరణ్ 1985 మార్చి 27న చెన్నైలో జన్మించారు. తండ్రి, మేనమామ, తాతయ్య అందరూ చిత్రసీమకు చెందినవారే కావడంతో చిన్నతనం నుంచీ చెర్రీ కూడా సినిమా వాతావరణాన్ని ఆస్వాధిస్తూనే పెరిగారు. దాంతో సహజంగానే చెర్రీకి చిత్రసీమపై ఆసక్తి కలిగింది. చిరంజీవి వారసుడిగా 2007లో రామ్ చరణ్ ‘చిరుత’ సినిమాతో తెరంగేట్రం చేశారు. చిరంజీవి తనయుడు కావడంతో చెర్రీకి ఒక్క సినిమాలో నటించకపోయినా, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అదే సమయంలో చిరంజీవి రాజకీయ ప్రవేశంపై పలు ఊహాగానాలు సాగుతూ ఉన్నాయి. ఆయన నటవారసునిగా చరణ్ వస్తున్నాడని తెలియగానే, ఈ అంశంపైనా చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తొలి చిత్రం ‘చిరుత’తోనే ఆకట్టుకోవడం విశేషం. చరణ్ తన రెండో చిత్రం ‘మగధీర’తోనే ఇండస్ట్రీ హిట్ పట్టేశారు. ‘మగధీర’ గ్రాండ్ సక్సెస్ చెర్రీని ఎక్కడికో తీసుకు వెళ్ళింది. అభిమానులకు మరచిపోలేని మధురానుభూతిని పంచింది ‘మగధీర’. అదే యేడాది చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా చేశారు. అభిమానులు చరణ్ లోనే చిరంజీవిని చూసుకోసాగారు.
తండ్రి అడుగుజాడల్లోనే పయనించసాగారు చెర్రీ. స్టార్ డమ్ రాగానే నాన్న బాటలోనే పయనిస్తూ హిందీ చిత్రసీమవైపూ దృష్టి సారించారు చరణ్. అమితాబ్ బచ్చన్ కు యాంగ్రీ మేన్ గా గుర్తింపు తెచ్చిన ‘జంజీర్’ ను రీమేక్ చేశారు చెర్రీ. హిందీలో ‘జంజీర్’గా, తెలుగులో ‘తుఫాన్’గా విడుదలయిన ఆ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. మళ్ళీ ‘మగధీర’ స్థాయి విజయం కోసం చరణ్ పలు విధాలా కృషి చేశారు. కానీ, ఫలితం దక్కలేదు. అయితే 2018లో అనూహ్యంగా రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ ఘనవిజయం సాధించింది. అందులో చిట్టిబాబు పాత్రలో చెర్రీ నటన అందరినీ ఆకట్టుకుంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘రంగస్థలం’ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలచింది.
ప్రతి అంశంలోనూ తండ్రిని అనుసరించే చరణ్, నిర్మాతగానూ ఆయన అడుగుల్లోనే పయనించారు. చిరంజీవి తన మాతృమూర్తి అంజనాదేవి పేరుపై అంజనా ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించారు. అదే తీరున రామ్ చరణ్ తన తల్లి సురేఖను సొంత చిత్రాలకు సమర్పకురాలిగా చేశారు. తమ ఇంటిపేరున కొణిదెల ప్రొడక్షన్స్ ను నెలకొల్పారు చెర్రీ. తొలి చిత్రంగా తండ్రితో ‘ఖైదీ నంబర్ 150’ నిర్మించారు. చిరంజీవి రీ ఎంట్రీగా విడుదలయిన ‘ఖైదీ నంబర్ 150’ ఘనవిజయం సాధించింది. తరువాత చిరంజీవి తొలి చారిత్రక చిత్రంగా రూపొందిన ‘సైరా… నరసింహారెడ్డి’ని కూడా చెర్రీనే నిర్మించడం విశేషం. తండ్రిని మరిన్ని వైవిధ్యమైన పాత్రల్లో చూడాలని నిర్మాణభాగస్వామిగా ‘ఆచార్య’ రూపొందించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతం చరణ్, శంకర్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాతో రామ్ చరణ్ ఏ తీరున తమను అలరిస్తాడోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదలా ఉంచితే, రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’తో పశ్చిమ దేశాలవారినీ ఆకట్టుకున్నారు చరణ్. ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుందనీ వినిపిస్తోంది. ఒకవేళ ‘ట్రిపుల్ ఆర్’కు సీక్వెల్ ఉంటే, అందులో చరణ్ ఏ రీతిన అలరిస్తారో చూడాలి.
