అన్వేషణ, అభినందన లాంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఒకప్పటి కోలీవుడ్ హీరో ‘కార్తీక్’. ఇతని కొడుకుగా ‘గౌతమ్ కార్తీక్’ కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తమిళనాట హీరోగా సెటిల్ అయిన ‘గౌతమ్ కార్తీక్’, ‘సాహసమే శ్వాసగా సాగిపో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన మలయాళ బ్యూటీ ‘మంజిమ మోహన్’ని పెళ్లి చేసుకున్నాడు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు కుటుంబ సభ్యుల మధ్య చెన్నైలోని ఒక హోటల్ లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ముత్తయ్య డైరెక్ట్ చేసిన ‘దేవరట్టం’ సినిమాలో గౌతమ్, మంజిమ కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. తానే తొలుత ఆమెకు ప్రపోజ్ చేశానని గతంలో గౌతమ్ తెలిపాడు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ కెరీర్ స్టార్ట్ చేసిన మంజిమ మోహన్, తెలుగులో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాల్లో ‘నారా భువనేశ్వరి’గా నటించింది. సెలక్టివ్ సినిమాలనే చేస్తూ వచ్చిన మంజిమ మోహన్ 29 ఏళ్లకే పెళ్లి చేసుకోవడం ఆమె అభిమానులని హార్ట్ చేసే విషయమే.