Site icon NTV Telugu

Manisha Koirala Birthday Special : మనీషా కొయిరాల… అందాల లీల!

Manisha Koirala Birthday Special

Manisha Koirala Birthday Special

Manisha Koirala Birthday Special :లేలేత అందాలు, నాజూకు షోకులతో జనం ముందు నిలచిన మనీషా కొయిరాలను చూడగానే ‘నేపాలీ బాల’ అన్నారు ప్రేక్షకులు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా వయసు మీద ఆమెను అభిమానులు అలాగే ఆరాధిస్తూ ఉండడం విశేషం! ఖాట్మాండ్ లో పుట్టినా, హిందీ సినిమాలతోనే మన జనానికి సుపరిచితురాలయింది మనీషా. కేన్సర్ ను సైతం జయించి, ఆ వ్యాధిపై జనాల్లో అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నారామె. మహిళా హక్కుల కోసం కూడా మనీషా తనదైన రీతిలో పోరాటం సాగిస్తున్నారు.

మన సరిహద్దుల్లో ఉన్న నేపాల్ అసలైన హిందూ దేశం అని ఎంతోమంది అంటూ ఉంటారు. అక్కడ కొయిరాలా వంశస్థులు అనేక దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఒకప్పటి నేపాల్ ప్రధాన మంత్రి బిశ్వేశ్వర్ ప్రసాద్ కొయిరాల మనవరాలు మనీషా. 1970 ఆగస్టు 16న ఖాట్మాండులో జన్మించారు మనీషా. ఆమె తండ్రి ప్రకాశ్ కొయిరాల కూడా పర్యావరణ, శాస్త్ర సాంకేతిక మంత్రిగా నేపాల్ ప్రభుత్వంలో పనిచేశారు. ప్రకాశ్ బాల్యం నుంచీ మనీషాకు ఎంతో స్వేచ్ఛనిచ్చారు. చదువుకొనే రోజుల్లోనే థియేటర్ ఆర్ట్స్ పై మనసు పారేసుకుంది కొయిరాల. స్కూల్ లో కొన్ని నాటకాల్లో నటించిన మనీషా 1989లో ‘ఫెరీ భేతౌల’ అనే నేపాలీ చిత్రంలో తొలిసారి నటించింది. ఆ తరువాత సుభాష్ ఘయ్ తెరకెక్కించిన ‘సౌదాగర్’తో హిందీ చిత్రసీమలో అడుగుపెట్టింది. అప్పటి నుంచీ తన దరికి చేరిన పాత్రల్లో నటించేస్తూ అనతికాలంలోనే నటిగా మంచి పేరు సంపాదించింది మనీషా కొయిరాల. మణిరత్నం తెరకెక్కించిన ‘బొంబాయి’ సినిమాతో దక్షిణాదికి వచ్చిన మనీషా, నాగార్జున ‘క్రిమినల్’లోనూ నటించి, తెలుగువారిని ఆకట్టుకుంది. శంకర్ తెరకెక్కించిన ‘భారతీయుడు, ఒకే ఒక్కడు’ చిత్రాలలోనూ మనీషా అందాలు జనాన్ని మురిపించాయి. రజనీకాంత్ ‘బాబా’లోనూ మనీషా నటించి ఆకట్టుకుంది. శ్రీకాంత్ హీరోగా రూపొందిన ‘నగరం’ చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ లో చిందేసింది మనీషా. 2014లో కేన్సర్ ను జయించిన మనీషా ఆ తరువాత నుంచీ మళ్ళీ నటించసాగారు. నెట్ ఫ్లిక్స్ ‘లస్ట్ స్టోరీస్’లో ఓ కథలో నాయికగా నటించారామె. సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సంజూ’లో ఆయన తల్లి నర్గీస్ పాత్రలోనూ మనీషా మురిపించారు. కార్తిక్ ఆర్యన్ హీరోగా రూపొందుతోన్న ‘షెహజాదా’లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారామె.

ఇప్పటికీ తనకు నచ్చిన పాత్రల్లో నటించడానికి మనీషా కొయిరాల ఉత్సాహంగానే ఉన్నారు. అలాగే సామాజిక సేవలోనూ తనవంతు కృషి చేస్తున్నారు. మనీషా మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.

Exit mobile version