ప్రముఖ దర్శకుడు మణిరత్నం పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది హృదయాలను తాకే అందమైన ప్రేమ కథలు. అయితే ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘థగ్‌లైఫ్’ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ఫలితంగా కొంత నిరాశకు లోనైన మణిరత్నం, తన ఫేవరెట్ జోనర్ అయిన లవ్ డ్రామా వైపు మళ్లీ రీటర్న్ అవ్వడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఆయన కొత్తగా తెరకెక్కించబోయే చిత్రంలో తమిళ యువ హీరో ధ్రువ్ విక్రమ్, కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరో హీరోయిన్లుగా నటించనున్నారు. తొలిసారి స్క్రీన్ పై కలసి నటించనున్న ఈ జంట సినిమాకు హైలైట్‌గా నిలవనుందని భావిస్తున్నారు.
Also Read : Tamannaah : ఆ సౌత్ స్టార్ నాకు క్షమాపణలు చెప్పాడు..
ప్రేమ, కుటుంబ సంబంధాలు, వ్యక్తిగత సంఘర్షణలు అన్నీ కలగలిపిన ఒక భావోద్వేగ భరితమైన కథతో మణిరత్నం ఈ సినిమాను రూపొందించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం అందించనున్న ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మరో స్పెషల్ అట్రాక్షన్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశముంది. మణిరత్నం గత సినిమాలకన్నా పూర్తి భిన్నంగా, కొత్త ఎనర్జీతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని తెలిసింది. కథలోని పాత్రలు, వారి మధ్య ఉన్న బంధాలు ప్రేక్షకులకు కొత్తగా అనిపించేలా మణిరత్నం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత మణిరత్నం మళ్లీ ఓ క్లాస్ లవ్ స్టోరీతో వెండితెరపై సందడి చేయబోతుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
