“నారాయణతే నమో నమో…” అంటూ గానం చేస్తూ ఎస్.వరలక్ష్మి ‘సతీసావిత్రి’ చిత్రంలో తొలిసారి గళం వినిపించారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ. అంతకు ముందే బాలగాయకుడిగా మధురం పంచి, బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతీ రామకృష్ణనే పరవశింప చేసిన ఘనత మంగళంపల్లి వారి సొంతం.
“సలలిత రాగసుధారస సారం…” అని ఆలపించి, నటరత్న నందమూరి అభినయానికి తగిన గళవిన్యాసాలు చేసి ‘నర్తనశాల’లో సుధారసమే కురిపించారు మంగళంపల్లి. ఆపై యన్టీఆర్ కే ‘శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథ’లో “వసంత గాలికి వలపుల రేగ…” అంటూ పరవశింప చేశారు.
‘ఉయ్యాల-జంపాల’ కోసం బాలమురళి పాడిన “ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు…” గీతం ఒకసారి వింటే చాలు మనలను ఒక పట్టాన వీడదు.
“ఆది అనాదియు…నీవే దేవా…” అంటూ అసలైన తత్వం బోధించి, “నారద సన్నుత నారాయణా…” అని మధురం చిలికించి, “వరమొసగే వనమాలీ…” అంటూ ‘భక్త ప్రహ్లాద’లో నటగాయకునిగా బాలమురళీకృష్ణుని గానకేళి తనివి తీరనీయదు.
“మౌనమె నీ బాస ఓ మూగమనసా…” అంటూ మనసుకూ ఓ భాష ఉందని ఆత్రేయ అక్షరరూపమిస్తే, ఆ రూపానికి తన గాత్రంతో ‘గుప్పెడు మనసు’లో ప్రాణం పోసిన ‘గానవిధి’ మన మంగళంపల్లి.’నర్తనశాల’ను పోలిన ‘శ్రీమద్విరాటపర్వము’లోనూ నందమూరి నటదర్శకత్వ ప్రతిభకు దీటుగా “ఆడవే హంసగమనా…” అంటూ పల్లవించి, “జీవితమే కృష్ణసంగీతమూ…” అనీ మురిపించిన గానకళానిధి మంగళంపల్లి!
తెలుగు సంగీత ప్రపంచంలో మేరునగధీర సమానులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ. 1930 జూలై 6న తూర్పు గోదావరి జిల్లా రాజోలు తాలూకా శంకరగుప్తంలో జన్మించారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ. బాల్యంలోనే బాలమురళీకృష్ణ సప్తస్వరాలతో సంబంధం ఏర్పరచుకున్నారు. ఆయన గళంలో సరిగమలు సరళంగా సాగే తీరు, పదనిసలు పరుగులు తీసే జోరు చూసిన తండ్రి మంగళంపల్లి పట్టాభిరామయ్య, బాలమురళిని కొచ్చర్లకోట రామరాజు అనే సంగీత విద్వాంసుని వద్ద చేర్పించారు. ఆ తరువాత సుసర్ల దక్షిణామూర్తి వద్ద, ఆయన శిష్యుడైన పారుపల్లి రామకృష్ణ దగ్గర సంగీత సాధన చేశారు బాలమురళి. ఎనిమిదేళ్ళ ప్రాయంలోనే విజయవాడలో కచేరీ చేసి భళా అనిపించారు మంగళంపల్లి.
సినిమా రంగం సైతం బాలమురళిని ఎర్రతివాచీ వేసి ఆహ్వానించింది. ఏయన్నార్, ఎస్.వరలక్ష్మి, యస్వీ రంగారావు నటించిన ‘సతీ సావిత్రి’లో తొలిసారి తన గళం వినిపించారు బాలమురళీకృష్ణ. ఆ పై పలు చిత్రాలలో గానం చేసినా, తన కచేరీలతోనే ఆయన బిజీగా సాగారు. ఆరంభంలో సినిమాలపై మోజు పెంచుకున్నారు కానీ, ప్రపంచవ్యాప్తంగా కచేరీలు చేస్తూ శాస్త్రీయ సంగీతం పట్ల జనుల్లో ఆసక్తి కలిగించారు. బాలమురళి కచేరీ చూసిన వారెందరో తమ పిల్లలకు సంగీతశిక్షణ ఇప్పించారు. ఆపై బాపు తెరకెక్కించిన ‘అందాలరాముడు’లో “పలుకే బంగారమాయెరా…”, ‘శ్రీరామాంజనేయ యుద్ధం’లో “మేలుకో శ్రీరామా…” ‘ముత్యాలముగ్గు’లో “శ్రీరామ జయరామ…” అంటూ వీనులవిందు చేశారు. ‘సతీసావిత్రి’, ‘జయభేరి’, ‘కురుక్షేత్రం’ వంటి కొన్నిచిత్రాలలో పద్యాలు, శ్లోకాలు కూడా పాడి అలరించారాయన. దాసరి తెరకెక్కించిన ఏయన్నార్ 200వ చిత్రం ‘మేఘసందేశం’లోని బాలమురళి పాడిన “పాడనా… వాణి కళ్యాణిగా…” గీతం మనసులను పరవశింప చేస్తూనే ఉంటుంది. చివరగా ఆయన మాతృభాష తెలుగులో పాడిన సినిమా పాట, ‘ప్రియమైన శ్రీవారు’లోని “జాతకాలు కలిసేవేళ…” అంటూ సాగింది.
మాతృభాష తెలుగులోనే కాదు తమిళ, కన్నడ భాషల్లోనూ మంగళంపల్లి వారి గళం పలు విన్యాసాలు చేసి మధురామృతం పంచింది. 1975లో తెరకెక్కిన ‘హంసగీతె’ అనే కన్నడ చిత్రం ద్వారా బాలమురళీకృష్ణ ఉత్తమ గాయకునిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ‘హంసగీతె’ చిత్రానికి స్వరకల్పన కూడా చేశారాయన. 1986లో రూపొందిన కన్నడ చిత్రం ‘మద్వాచార్య’కు సంగీతం సమకూర్చి, జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా నిలిచారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులూ ఆయనను వరించాయి. ఎన్నెన్నో ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు ఆయన కీర్తి కిరీటంలో రతనాలుగా వెలిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం, శృంగేరీ పీఠంకు ఆస్థాన సంగీత విద్వాంసునిగా ఉన్నారు బాలమురళీకృష్ణ.
కర్ణాటక సంగీతంలో తనకు తానే సాటి అనిపించుకున్న మంగళంపల్లి బాలమురళీకృష్ణ సొంతగా కొన్ని రాగాలు ఆవిష్కరించారు. కళలు, కళాకారులు అంటే బాలమురళికి ఎంతో గౌరవం. యన్టీఆర్ తన అభిమాన నటులు అని చెప్పుకున్నారు. అలాగని, రామారావు నటించిన సంగీతానికి పీటవేసిన చిత్రాలను కాకుండా, ఆయన నటించిన యాక్షన్ మూవీస్ ను ఎక్కువగా ఇష్టపడేవారు బాలమురళి. యన్టీఆర్ కు “నర్తనశాల, శ్రీకాకుళాంధ్రమహావిష్ణు కథ, శ్రీమద్విరాటపర్వము” చిత్రాలలో నేపథ్యగానం చేశారు బాలమురళి. అయితే 1983లో యన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన రాష్ట్రంలోని లలిత కళా అకాడమీలను రద్దు చేశారు. ఓ కళాకారుడై ఉండి, రామారావు కళా అకాడమీలను రద్దు చేయడం మంగళంపల్లికి నచ్చలేదు. దాంతో తాను హైదరాబాద్ లో పాడనని భీష్మించుకున్నారు. 1989లో యన్టీఆర్ పార్టీ ఓటమి చవిచూసిన తరువాత అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి అభ్యర్థనతో మళ్ళీ భాగ్యనగరంలో బాలమురళి గళం వినిపించారు. 1994లో యన్టీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన ఆహ్వానం మేరకు వచ్చి పాడారు మంగళంపల్లి.
తన గానమాధుర్యంతో సంగీతాభిమానులను ఆనందసాగరంలో మునకలేయించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ 2016 నవంబర్ 22న తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికంగా దూరమైనా బాలమురళి గానం ఈ నాటికీ సంగీతప్రియులకు అమృతం పంచుతోంది.