Site icon NTV Telugu

Manchu Vishnu: మనోజ్ తో గొడవ.. ఎట్టకేలకు స్పందించిన మంచు విష్ణు

Manchu Manoj

Manchu Manoj

Manchu Vishnu: మంచు బ్రదర్స్ గొడవ చిలికి చిలికే గాలివానగా మారింది. అన్నదమ్ముల మధ్య విబేధాలు తలెత్తాయని వార్తలు వస్తూనే ఉన్నా కూడా మంచు బ్రదర్స్ ఏనాడు స్పందించింది లేదు. నేడు మనోజ్ పోస్ట్ చేసిన ఒక్క వీడియో.. వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉన్నాయి అనేది స్పష్టం చేసింది. గత రాత్రి మనోజ్ ఆఫీస్ కు వెళ్లి విష్ణు.. వారి బంధువులపై దాడికి పాల్పడిన వీడియోను ఆయన షేర్ చేయడం, అది కాస్తా వైరల్ గా మారడం చకచకా జరిగిపోయాయి. తన ఇంటికి వచ్చి, తన బంధువుల మీద విష్ణు ఇలా దాడికి దిగుతున్నాడని మనోజ్ ఆ వీడియోలో క్లియర్ గా చెప్పాడు. సారథి అనే వ్యక్తితో విష్ణు గొడవపడుతున్నట్లు కనిపించాడు. ఇక ఈ గొడవ అక్కడితో ఆగలేదు. మోహన్ బాబు వెంటనే మనోజ్ కు కాల్ చేసి ఆ వీడియోను డిలీట్ చేయించడం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇక మోహన్ బాబు చెప్పిన వెంటనే మనోజ్ ఆ వీడియోను డిలీట్ చేశాడు.

ఇక అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. మీడియా మొత్తం మంచు బ్రదర్స్ వైపే ఫోకస్ చేసింది. దీంతో చేసేది లేక మంచు విష్ణు ఈ ఘటనపై స్పందించాల్సి వచ్చింది. రాత్రి జరిగిన గొడవతో పాటు ఆ వీడియో పోస్ట్ చేయడంపై కూడా మంచు విష్ణు వివరణ ఇచ్చాడు. ” అది చిన్న గొడవ.. దాన్ని పెద్దది చేయాల్సిన అవసరం లేదు. మనోజ్ కు, నాకు మధ్య ఇలాంటి గొడవలు జరగడం సాధారణమే. మీరు చూశారో లేదో.. సారథితో గొడవను మనోజ్ ఆపలేదు.. జస్ట్ వీడియో తీసి పోస్ట్ చేశాడు. మనోజ్ చిన్నవాడు.. ఏదో ఆవేశంలో అలా పోస్ట్ చేశాడు. చిన్న విషయం.. దీన్ని భూతద్దంలో పెట్టి చూడకండి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మంచు బ్రదర్స్ వార్ ఇండస్ట్రీలో హీట్ ను పుట్టిస్తోంది. మరి ఈ గొడవ ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

Exit mobile version