Manchu Vishnu Again Reacts On Trolls In Ginna Press Meet: హీరో మంచు విష్ణు మరోసారి ట్రోలింగ్‌పై స్పందించాడు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లో నిర్వహించిన జిన్నా ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వారంతా ఒక కుటుంబంలాగే ఉండే వాళ్లమన్నాడు. కానీ.. ఈమధ్య మీడియా పెరిగిపోవడం వల్ల సైడ్ ట్రాక్ పట్టిందని బాంబ్ పేల్చాడు. ఇక తనని ట్రోల్ చేస్తోన్న ట్రోలర్స్‌పై తాను సైబర్ క్రైమ్ వాళ్లకు ఫిర్యాదు చేశానన్నాడు. తమకు రెండు ఐపీ అడ్రస్‌లు దొరికాయని.. అందులో ఒకటి జూబ్లీహిల్స్‌లో ఉన్న ఒక హీరో ఆఫీస్ కాగా, మరొకటి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో ఉందన్నాడు. ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, తనని ట్రోల్ చేస్తున్నాడని చెప్పాడు. 18 యూట్యూబ్ ఛానెల్స్‌పై కూడా తాను కేసులు పెడుతున్నానన్నాడు. సాధారణంగానే తాను ట్రోల్స్‌ని పట్టించుకోనని, కానీ జవాబుదారీతనం కోసం కేసులు పెట్టాల్సి వస్తోందని స్పష్టం చేశాడు.
ఆన్‌లైన్ మీడియా అనేది ఒక డేంజరస్ వెపన్ అని.. భవిష్యత్తును బాగుపరచుకోవడం కోసం దాన్ని ఒక టూల్‌గా వాడుకోవచ్చని, అలాగే వెపన్‌గానూ వాడొచ్చని మంచు విష్ణు అన్నాడు. మా ఎన్నికల సమయం నుంచే తనపై ట్రోలింగ్స్ మొదలయ్యాయని, అలాగే తమ సినిమాల రిలీజ్ సమయంలో ఎక్కువగా ట్రోలింగ్‌కి పాల్పడుతున్నారని, ఇదంతా ఓ పెయిడ్ క్యాంపెయిన్ అని చెప్పుకొచ్చాడు. అయినా.. తనపై ఇంత ఖర్చు పెట్టి, ఇలా ట్రోలింగ్‌కి ఎందుకు పాల్పడుతున్నారో తనకు అర్థం కావడం లేదని, తనకే కామెడీగా అనిపిస్తోందని సెటైర్లు వేశాడు. ఇక 18 యూట్యూబ్ ఛానెల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశాక మరిన్ని నిజాలు బయటపడతాయని.. తమనే కావాలని టార్గెట్ చేస్తున్నారా? లేక ఇతరుల్ని కూడా ట్రోల్ చేస్తున్నారా? అనే విషయాలు వెలుగులోకి వస్తాయన్నాడు. తమని ట్రోల్ చేస్తున్న వారి పేర్లు బయటకు వచ్చినప్పుడు.. వారి పరువు బజారున పడుతుందని మంచి విష్ణు తెలిపాడు.
ఇక ఇదే సమయంలో.. తన సినిమా జిన్నాను అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ చేయాలని తాము ఎప్పుడూ ఫిక్స్ అవ్వలేదని మంచు విష్ణు క్లారిటీ ఇచ్చాడు. ఒకవేళ తాము అనుకున్నట్టు పనులన్నీ సవ్యంగా సాగి ఉంటే, కచ్ఛితంగా ఆరోజే రిలీజ్ చేసేవాళ్లమని తెలిపాడు. అక్టోబర్ 5న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నామని, అక్టోబర్ 21న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పాడు. ఇప్పుడు పోటీకి పోయి సినిమాని రిలీజ్ చేస్తే, థియేటర్లు తక్కువే దొరుకుతాయని.. అందుకే లాంగ్ వీకెండ్ చూసుకొని దీపావళి కానుకగా సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టు క్లారిటీ ఇచ్చాడు.