NTV Telugu Site icon

Manchu Lakshmi: వైవిధ్యమే లక్ష్మి మంచు ఆయుధం!

Manchu Lakshmi

Manchu Lakshmi

Manchu Lakshmi: నటి, నిర్మాత, నిర్వహాకురాలుగా మంచు లక్ష్మి సాగిన తీరే వేరు. తెలుగు చిత్రసీమలో తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని నటనలో అడుగుపెట్టిన అమ్మాయిలు చాలా కొద్దిమందే కనిపిస్తారు. వారిలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు మంచు లక్ష్మి. తండ్రి మోహన్ బాబు తనదైన కంచుకంఠంతో విలక్షణమైన పాత్రల్లో జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నారు. అదే తీరున మంచు లక్ష్మి సైతం వరైటీ రోల్స్ తో నటనలో అలరించారు. మాతృభాష తెలుగులో నటించక ముందే ఇంగ్లిష్ లో నటిగా తెరపై కనిపించారు లక్ష్మి. ఇక తెలుగు తెరపై మంచు లక్ష్మి తనదైన అభినయంతో ఆకట్టుకున్న తీరును జనం మరచిపోలేరు.

విలక్షణ నటుడు మోహన్ బాబు ఏకైక పుత్రిక మంచు లక్ష్మి. 1977 అక్టోబర్ 8న లక్ష్మి జన్మించారు. బాల్యంలోనే తండ్రి నిర్మించిన చిత్రాలలో లక్ష్మి కనిపించారు. అలా చిన్నప్పటి నుంచీ లక్ష్మికి అభినయంలో ప్రవేశమున్నట్లే! కూతురులోని ఉత్సాహాన్ని గమనించిన మోహన్ బాబు ఆమెను ప్రోత్సహించారు. అమెరికాలో సినిమాకు సంబంధించిన కళను అభ్యసించిన లక్ష్మి అక్కడే టీవీ సీరియల్స్ లో నటించారు. అదే సమయంలో “ది ఓడ్, డెడ్ ఎయిర్” వంటి చిత్రాలలోనూ అభినయించారు. మాతృభాష తెలుగులో మంచు లక్ష్మి ఎంట్రీయే ఎంతో విలక్షణంగా సాగింది అని చెప్పవచ్చు. కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందిన ‘అనగనగా ఓ ధీరుడు’ జానపద చిత్రంలో ఐరేంద్రి అనే విలక్షణ పాత్రతో తెలుగువారి ముందు తొలిసారి నటిగా మంచు లక్ష్మి నిలిచారు. అందులో మాంత్రికురాలిగా మంచు లక్ష్మి ప్రదర్శించిన అభినయంతో మంచి మార్కులే సంపాదించారామె. ఈ చిత్రంతో బెస్ట్ విలన్ గా లక్ష్మికి నంది అవార్డు కూడా లభించింది.

“దొంగలముఠా, ఊ కొడతారా? ఉల్లిక్కి పడతారా?, గుండెల్లో గోదారి, దూసుకెళ్తా, చందమామ కథలు, బుడుగు, దొంగాట, గుంటూరు టాకీస్, లక్ష్మీ బాంబ్, వైఫాఫ్ రామ్” వంటి చిత్రాలలో ఆమె అభినయం ఆకట్టుకుంది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ‘పిట్ట కథలు’లోనూ లక్ష్మి నటించారు. వెండితెరపై వెలిగిపోవడమే కాదు బుల్లితెరపైనా కొన్ని కార్యక్రమాలను నిర్వహించి ఆకట్టుకున్నారు మంచు లక్ష్మి. ఆమె నిర్వహించిన “లక్ష్మీ టాక్ షో, ప్రేమతో మీ లక్ష్మి, లక్కుంటే లక్ష్మి, మేము సైతం…” వంటి టీవీ కార్యక్రమాలు జనాన్ని భలేగా అలరించాయి.

“నేను మీకు తెలుసా, ఝుమ్మంది నాదం, ఊ కొడతారా? ఉలిక్కి పడతారా? గుండెల్లో గోదారి, దొంగాట” వంటి చిత్రాలను నిర్మించి, నిర్మాతగానూ తనదైన బాణీ పలికించారు లక్ష్మి. చిత్రసీమలో నటనిర్మాతగా అత్యధిక చిత్రాలను రూపొందించిన ఘనత మోహన్ బాబుకే దక్కుతుంది. ఆయన వారసురాలిగా మంచు లక్ష్మి సైతం నటనతోపాటు, నిర్మాతగానూ అభిరుచిని చాటుకున్నారు. మునుముందు కూడా లక్ష్మి తనదైన బాణీ పలికిస్తూ సాగాలని ఆశిద్దాం.