NTV Telugu Site icon

చిత్రపురి కొవిడ్ బాధితులకు అండగా ‘మనం సైతం’

చిత్రపురి కాలనీలో కొవిడ్ బారినపడిన వారికి ఆత్మస్థైర్యాన్ని అందిస్తోంది కాదంబరి కిరణ్ “మనం సైతం” సేవా సంస్థ. అక్కడి కరోనా బాధితులకు ప్రతి రోజూ ఆహారం, ఆక్సీజెన్ సిలిండర్లు, ఆక్సీజెన్ కాన్సెన్ట్రేటర్, మందుల కిట్, పీపీఈ కిట్లు, మాస్క్ లు, శానిటైజర్, ఇమ్మ్యూనిటి పౌడర్, పళ్ళు, డ్రై ఫ్రూట్స్, ఆక్సీమీటర్లు, థర్మామీటర్లు, ఇంజెక్షన్లు అందిస్తున్నారు. ఉదయం నుంచే మొదలయ్యే ఈ సేవా కార్యక్రమాలు రాత్రి దాకా కొనసాగుతున్నాయి. బాధితుల అవసరాలు తెలుసుకుని, ‘మనం సైతం’ టీమ్ తక్షణమే స్పందించి వారికి సహాయం అందిస్తోంది. ఆరోగ్యకరమైన భోజనాలను ప్యాక్ చేసి బాధితుల వద్దకు వెళ్లి అందజేస్తోంది. ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ… ”ఈ కష్టకాలంలో మా చిత్రపురి వాసులకు అండగా నిలబడటం సంతృప్తిగా ఉంది. వారు త్వరగా కోలుకుని ఆరోగ్యంగా సంతోషంగా కాలనీలో ఉండటమే మాకు కావాల్సింది. అప్పుడే మా సేవకు నిజమైన ఫలితం దక్కింది అనుకుంటాం. అవసరంలో ఉన్నవారి కోసం ఎప్పుడైనా ఎక్కడికైనా సిద్ధం” అన్నారు. కాదంబరి కిరణ్ సారథిలా నడిపిస్తున్న ఈ సేవా వాహినికి వల్లభనేని అనిల్ కుమార్, అనిత నిమ్మగడ్డ, రుద్రరాజు రమేష్, సీసీ శ్రీను, రమేష్ రాజా, నాగరాజు, ప్రభాకర్, అంజలి, మీనా, సురేష్ ,చిల్లర వేణు అంజలి, జయ, హరిత, కృష్ణ శివయ్య అండ్ టీం తమ పూర్తి సహకారం అందిస్తున్నారు.