భారీ అంచనాలు లేకుండా విడుదలైన ఏ సినిమా అయినా.. ప్రేక్షకులకు బలంగా కనెక్ట్ అయితే అద్భుతాలు సాధించగలదు. ఈ ఫార్ములాను మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ రుజువు చేసింది. సాధారణంగా ఇండస్ట్రీ హిట్‌కు భారీ కథ, స్టార్ టెక్నీషియన్లు, ఖరీదైన సెట్స్ అవసరమనే భావన ఉంటుంది. కానీ ఎంఎస్‌జీ మాత్రం ఈ అన్ని ఫార్మూలాలను పక్కన పెట్టి.. కంటెంట్ బలంతోనే ప్రాంతీయ స్థాయిలో ఇండస్ట్రీ హిట్ కలెక్షన్లు సాధించింది. జనవరి 12న రిలీజ్ అయిన ఈ చిత్రం రూ.300 కోట్లు కొల్లగొట్టింది. ఈ ఏడాది ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కూడా నిలిచింది.
ఎంఎస్‌జీ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో హై కాన్సెప్ట్ కథ లేదు, గొప్ప ట్విస్టులతో నడిచే స్టోరీ కూడా కాదు. సాధారణమైన కథను సహజంగా చెప్పిన విధానం, పాత్రలతో ప్రేక్షకులు రిలేట్ అయ్యేలా చేసిన నెరేషన్‌నే సినిమాకు ప్రధాన బలం. అదేవిధంగా రెగ్యులర్‌గా కనిపించే స్టార్ కమెడియన్లు గానీ, ప్రత్యేకంగా ప్లాన్ చేసిన కామెడీ ట్రాక్‌లు గానీ ఇందులో లేవు. అయినా ప్రేక్షకులు నవ్వారు, భావోద్వేగానికి లోనయ్యారు. పేరున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా, కొత్త కంపోజర్ పని చేశారు. అలాగే డాన్స్ మాస్టర్లు కూడా పెద్ద బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న వారే. అయినప్పటికీ పాటలు కథలో సహజంగా మిళితమై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఖరీదైన పాటల సెట్లు, విదేశీ లొకేషన్లు లేకపోయినా.. సినిమాకు ఎక్కడా లోటు అనిపించలేదు.
Also Read: Drishyam 3: ‘దృశ్యం 3’కు గ్రీన్ సిగ్నల్.. షూటింగ్ ప్రారంభం ఎప్పుడంటే?
లోకేషన్ పరంగా చూస్తే.. సినిమా ఎక్కువగా రెండు ఇళ్లలోనే, ఒక అవుట్‌డోర్ ఎపిసోడ్‌తో పూర్తయ్యింది. భారీ సెట్లు, ఖర్చుతో కూడిన ప్రొడక్షన్ డిజైన్ లేకపోయినా.. కథకు అవసరమైన వాతావరణాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి చక్కగా సృష్టించారు. పెద్ద విలన్లు, భారీ యాక్షన్ సన్నివేశాలు లేకపోయినా.. కథలోని సంఘర్షణ ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేసింది. నయనతార, జరీనా వహాబ్ మధ్య వచ్చే ఓ సన్నివేశంతో మంచి మెసేజ్ ఇచ్చారు. స్కేల్, హైప్ కంటే కంటెంట్, ప్రేక్షకులతో ఏర్పడే కనెక్ట్ చాలా గొప్పవని ఈ సినిమా నిరూపించింది. తక్కువ వనరులు, నిజాయితీగా సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనడానికి ఎంఎస్‌జీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచింది.
