టీవీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన నటి సోనారికా భడోరియా. 2011లో ‘తుమ్ దేనా సాత్ మేరా’ సీరియల్‌తో చిన్న తెరపైకి వచ్చిన సోనారికా, హిందీ టీవీ రంగంలో తక్కువ కాలంలోనే తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమెకు అసలైన స్టార్‌డమ్ తీసుకువచ్చినది ‘దేవోన్ కే దేవ్ మహాదేవ్’. అందులో పార్వతీ పాత్రలో కనిపించి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. ఆ షో తర్వాత ఆమెను అభిమానులు నిజంగానే పార్వతీ దేవిగా గుర్తు పెట్టుకున్నారు. టీవీతో పాటు సినీరంగంలో కూడా ప్రయాణం కొనసాగించిన సోనారికా, టాలీవుడ్ లో ‘జాదూగాడు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘స్పీడున్నోడు’లో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటించారు. అలాగే ‘ఈడో రకం ఆడో రకం’లో గ్లామర్‌తో ఆకట్టుకున్నారు. వెబ్ సిరీస్‌లు, హిందీ చిత్రాలు, సీరియల్స్ కలిపి ఆమె కెరీర్ ఆసక్తికరంగా సాగింది.
Also Read : Ustaad Bhagat Singh : ఈ క్షణం నా జీవితకాల జ్ఞాపకం – రాశీఖన్నా ఎమోషనల్ పోస్ట్
2024 ఫిబ్రవరిలో సోనారికా, వ్యాపారవేత్త వికాస్ పరాశర్ తో పెళ్లి చేసుకున్నారు. చాలా కాలం లవ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంట, సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చినా, ఆమె సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ తన లైఫ్ అప్‌డేట్స్ షేర్ చేస్తూనే ఉంది. ఇప్పుడు తమ కుటుంబంలో కొత్త అతిథి రాబోతున్నాడని ప్రకటించిన సోనారికా, బేబీ బంప్ ఫోటోలు షేర్ చేయడంతో అభిమానులు, స్నేహితులు అభినందనలు తెలుపుతున్నారు. నెటిజన్లు “పార్వతీ దేవి నిజంగానే అమ్మ అవుతున్నారు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి, టీవీ నుంచి సినిమాల వరకు తనదైన ముద్ర వేసుకున్న సోనారికా ఇప్పుడు తల్లిగా కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్నారు. ఈ గుడ్ న్యూస్‌తో ఆమె అభిమానుల్లో ఆనందం నిండిపోయింది.
