Site icon NTV Telugu

Magadheera: తెలుగు సినిమా సంచలనానికి 13 ఏళ్లు

Magadheera 13 Years Complet

Magadheera 13 Years Complet

Magadheera Movie Completed 13 Years: ‘అరవింద సమేత’లో రావు రమేశ్ చెప్పే ‘టార్చ్ బేరర్’ డైలాగ్ గుర్తుందా? దాన్ని మనం ‘మగధీర’ సినిమాకి ఆపాదించుకోవచ్చు. ఎందుకంటే.. అప్పటివరకూ రొటీన్ సినిమాలతో మన టాలీవుడ్ విసుగెత్తిపోయింది. జనాలు కూడా ‘ఇంకెంతకాలంరా బాబు ఇదే రొడ్డకొట్టుడు’ అనే ఫ్రస్ట్రేషన్‌కి వెళ్లిపోయారు. ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా చీవాట్లు తప్పలేదు. అలాంటి సమయంలో వచ్చి, టాలీవుడ్ రూపురేఖల్ని మార్చేసింది ‘మగధీర’ సినిమా! ‘ఏంటీ, ఇది తెలుగు సినిమానా’ అని యావత్ భారత చిత్రసీమ అని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ.. సరికొత్త ట్రెండ్‌కి శంఖం పూరించింది. తెలుగు సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.

చారిత్రాత్మక నేపథ్యానికి, ప్రస్తుతానికి లింక్ పెడుతూ.. దర్శకధీరుడు రాజమౌళి తీసిన ఈ సినిమా భారతీమ చిత్రసీమను ఉలిక్కిపడేలా చేసింది. అప్పట్లోనే రూ. 40 కోట్ల బడ్జెట్ వెచ్చించి, ఒక విజువల్ వండర్‌ని తెలుగు చిత్ర పరిశ్రమకు అందించాడు జక్కన్న. గుర్రపుస్వారీ, కత్తి యుద్ధాలు, వీరోచితి పోరాటాలు, కళ్లుచెదిరే విజువల్స్, గూస్‌బంప్స్ తెప్పించే ఎలివేషన్స్, వినసొంపైన పాటలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో ప్రతీదీ అద్భుతమే. ముఖ్యంగా.. 100 మందితో రామ్ చరణ్ చేసే పోరాట సన్నివేశం ఈ సినిమాకే హైలైట్. ఇప్పటికీ ఉత్తమ పోరాట సన్నివేశాల ప్రస్తావన వస్తే.. కచ్ఛితంగా మగధీరలోని ఆ సీన్ ముందు వరసలోనే ఉంటుంది. ఆ తర్వాత కూడా అలాంటివి ఎన్నో వచ్చాయి కానీ.. మగధీరలోని ఆ సీన్ మాత్రమే ఓ ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయింది.

అంతేకాదు.. బాక్సాఫీస్ లెక్కలు, రోజులు, సెంటర్ల పరంగానూ ఈ సినిమా నమోదు చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అప్పటివరకూ ఉన్న రికార్డుల్ని తుడిచిపెట్టేసి, సరికొత్త బెంచ్ మార్క్స్‌ని క్రియేట్ చేసింది. రిలీజైన 5 వారాల తర్వాత హైదరాబాద్‌లో 35 ధియేటర్లు పెంచారంటే, ఏ స్థాయిలో ఈ సినిమా ఆడియెన్స్‌ని ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి క్రియేటివిటీ, కీరవాణి మ్యూజిక్, ఫైట్స్, విజువల్ ఎఫెక్ట్స్.. అన్నీ కలగలిసి ఈ సినిమాని ప్రత్యేకంగా మలిచాయి. సరిగ్గా నేటితో 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. భారీ బడ్జెట్ చిత్రాలకు టార్చ్ బేరర్‌గా నిలిచింది.

Exit mobile version