NTV Telugu Site icon

Madhavapeddi Suresh Birthday Special : నాదామృతం పంచిన మాధవపెద్ది సురేశ్!

Madavapeddi Suresh

Madavapeddi Suresh

మాధ‌వ‌పెద్ది సురేశ్ పేరు విన‌గానే బాల‌కృష్ణ హీరోగా రూపొందిన `భైర‌వ‌ద్వీపం` ముందుగా గుర్తుకు వ‌స్తుంది. అందులోని పాట‌ల‌న్నీ ఒక ఎత్తు, “శ్రీ‌తుంబుర నార‌ద నాదామృతం…“ పాట ఒక్క‌టీ ఓ ఎత్తు. పెండ్యాల నాగేశ్వ‌రరావు సంగీత‌సార‌థ్యంలో ఘంట‌సాల గ‌ళంలో జాలువారిన `జ‌గ‌దేక‌వీరుని క‌థ‌`లోని “శివ‌శంక‌రీ శివానంద‌ల హ‌రి…“ పాట స్ఫూర్తితో ఈ గీతాన్ని రూపొందించారు. ఈ పాట‌తో మాధ‌వ‌పెద్ది సురేశ్ అజ‌రామ‌ర‌మైన కీర్తిని సొంతం చేసుకున్నారు. అంత‌కు ముందు, ఆ త‌రువాత కూడా మాధ‌వ‌పెద్ది సురేశ్ బాణీల్లో విన‌సొంపైన గీతాలే రూపొందాయి.

మాధ‌వ‌పెద్ది సురేశ్ 1951 సెప్టెంబ‌ర్ 8న జ‌న్మించారు. ఆయ‌న తండ్రి మాధ‌వ‌పెద్ది నాగేశ్వ‌ర‌రావు ఆంధ్రా సిమెంట్ కంపెనీలో ఇంజ‌నీర్ గా ప‌నిచేసేవారు. త‌ల్లి వ‌సుంధ‌ర సంగీతంలో ప్రావీణ్యురాలు. అందువ‌ల్ల మాధ‌వ‌పెద్ది సురేశ్ కు, ఆయ‌న అన్న ర‌మేశ్ కు బాల్యంలోనే సంగీతంలో ప్ర‌వేశం క‌లిగింది. చిన్న‌త‌నంలో అన్న‌ద‌మ్ములు ఇద్ద‌రూ క‌ల‌సి ప‌ర్వ‌దినాలలో శ్రావ్యంగా భ‌క్తిగీతాలు గానం చేసేవారు. సురేశ్ కంటే ముందు ఆయ‌న అన్న మాధ‌వ‌పెద్ది ర‌మేశ్ గాయ‌కునిగా చిత్ర‌సీమ‌లో ప్ర‌వేశించారు. మంచి గాత్ర‌మున్న గాయ‌కుడు. పెండ్యాల, చ‌క్ర‌వ‌ర్తి వంటివారు మాధ‌వ‌పెద్ది ర‌మేశ్ ను ప్రోత్స‌హించారు. బాల‌కృష్ణ‌కు ప‌లు చిత్రాల‌లో నేప‌థ్య‌గానం చేశారు ర‌మేశ్. ఆయ‌న త‌రువాత కొన్నాళ్ల‌కు సురేశ్ కూడా చిత్ర‌సీమ బాట ప‌ట్టారు. ప్ర‌ఖ్యాత గాయ‌కుడు మాధ‌వ‌పెద్ది స‌త్యం వీరికి బాబాయ్ అవుతారు. ఆయ‌న కూడా ప్రోత్స‌హించ‌డంతో ప‌లువురు సంగీత ద‌ర్శ‌కుల వ‌ద్ద అసోసియేట్ గా ప‌నిచేశారు సురేశ్. ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మ్యూజిక్ ట్రూప్ లో కీ బోర్డు ప్లేయ‌ర్ గా ఉంటూ దేశ‌విదేశాల్లో ప‌లు ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో పాల్గొన్నారు మాధ‌వ‌పెద్ది సురేశ్.

జంధ్యాల తెర‌కెక్కించిన `హై హై నాయ‌కా` చిత్రం ద్వారా మాధ‌వ‌పెద్ది సురేశ్ సంగీతానికి మంచి గుర్తింపు ల‌భించింది. తరువాత విజ‌యా సంస్థాధినేత‌ల్లో ఒక‌రైన బి.నాగిరెడ్డి వారసులు చంద‌మామ‌,విజ‌యా కంబైన్స్ ప‌తాకంపై చిత్రాల‌ను నిర్మించిన స‌మ‌యంలో మాధ‌వ‌పెద్ది సురేశ్ ను సంగీత ద‌ర్శ‌కునిగా ఎంచుకున్నారు. సింగీతం శ్రీ‌నివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వారు నిర్మించిన “బృందావ‌నం, భైర‌వ‌ద్వీపం, శ్రీ‌కృష్ణార్జున విజ‌యం“ చిత్రాల‌కు మాధ‌వ‌పెద్ది సురేశ్ సంగీతం స‌మ‌కూర్చి అల‌రించారు. దాంతో బాల‌కృష్ణ తాను న‌టించిన భార్గ‌వ్ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ `మాతో పెట్టుకోకు` చిత్రానికి కూడా సురేశ్ నే సంగీత ద‌ర్శ‌కునిగా ఎంచుకున్నారు. `శ్రీ‌కృష్ణార్జున విజ‌యం`తో మాధ‌వ‌పెద్ది సురేశ్ కు ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కునిగా నంది అవార్డు ల‌భించింది. అంద‌రూ బాల‌ల‌తో ఎమ్మెస్ రెడ్డి నిర్మించిన `రామాయ‌ణం` చిత్రానికి కూడా మాధ‌వ‌పెద్ది సురేశ్ బాణీలు క‌ట్టి అల‌రించారు. కొన్ని సంగీత కార్య‌క్రమాల్లో న్యాయ‌నిర్ణేత‌గానూ మాధ‌వ‌పెద్ది సురేశ్ వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న మ‌రిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.