‘సొంతవూరు, గంగపుత్రులు’ వంటి అవార్డ్ విన్నింగ్ మూవీస్ ను తెరకెక్కించి సెన్సిబుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పి. సునీల్ కుమార్ రెడ్డి తాజాగా ‘మా నాన్న నక్సలైట్’ అనే సినిమాను రూపొందించారు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో అనురాధ ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై చదలవాడ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తొంభైవ దశకంలోని సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సాగే ఈ కథలో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడైన రఘు కుంచె… కొండరుద్ర సీతారామయ్య అనే పాత్రను పోషించారు.
ఈ సినిమా గురించి సునీల్ కుమార్ రెడ్డి చెబుతూ, ”ఇది నక్సల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే తండ్రి కొడుకుల కథ. రఘు కుంచె ఒక నక్సల్ నాయకుడిగా, కొడుకు కోసం పరితపించే ఒక తండ్రిగా చాలా సహజంగా నటించారు. ఈ చిత్రంలో తండ్రి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో చూపించాం. ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ నేతృత్వంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు బాగా కుదిరాయి. ఆయన కూడా ఒక కీలక పాత్రను పోషించారు. ఇక నటుడు అజయ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా, సుబ్బరాజు రాజకీయ నాయకుడిగా, ఎల్.బి. శ్రీరామ్ జర్నలిస్ట్ సూర్య ప్రకాశరావుగా నటించారు. యువ జంటగా కృష్ణ బూరుగుల , రేఖ నిరోషా నటించిన ఈ చిత్రానికి ప్రవీణ్ ఇమ్మడి సంగీతం అందించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తాం” అని అన్నారు. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు సినిమా గురించి మాట్లాడుతూ, ‘మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునేలా అన్ని హంగులతో ఇది రూపుదిద్దుకుందని, నటీనటుల అభినయం, సాంకేతిక నిపుణుల పనితనంతో చిత్రం హృద్యంగా తెరకెక్కిందని, తండ్రి కొడుకుల సెంటిమెంట్ ప్రతి ఒక్క ప్రేక్షకుడి మనసునూ తాకుతుంద’ని చెప్పారు.
