NTV Telugu Site icon

భువనచంద్రుని పాటల వెన్నెల…!

పాటకు పల్లవి ప్రాణం అన్నట్టుగానే తెలుగు సినిమాలకు పాటలు ఆయువు. ముఖ్యంగా టాప్ హీరోస్ మూవీస్ కు పాటలు మరింత ప్రాణం. టాప్ స్టార్స్ ఫిలిమ్స్ జనాన్ని ఆకర్షిస్తాయి, అందులో సందేహం లేదు. అయితే మరింతగా ఆకట్టుకోవాలంటే ఖచ్చితంగా అలరించే పాటలు ఉండి తీరాలి. లేదంటే సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్ లో తేడా కనిపించక మానదు. అందుకనే తెలుగు చిత్రసీమలో సినీజనం పాటలకు పెద్ద పీట వేస్తూ ఉంటారు. ఎందరో గీతరచయితలు తమదైన బాణీ పలికిస్తూ తెలుగువారిని అలరించారు. భువనచంద్ర సైతం తన పంథాలో పదాలు పలికిస్తూ ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేశారు. తొలి సినిమా ‘ఖైదీ నంబర్ 786’ మొదలు ఇప్పటి దాకా భువనచంద్ర కలం నుండి జాలువారిన పాటలు జనాన్ని మురిపిస్తూనే ఉన్నాయి.

చిత్రసీమలో అడుగు పెట్టకముందు 18 ఏళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేశారు భువనచంద్ర. ఆ సమయంలో హిందీతో పాటు పంజాబ్, బెంగాల్ వంటి ఉత్తరాది భాషలతోనూ పరిచయం కలిగింది. దాంతో ఉత్తరాది పదాలను సైతం పట్టుకు వచ్చి తన పాటల్లోకి నెట్టి, ఇట్టే ఆకట్టుకోవడంలో భళా అనిపించారు భువనచంద్ర. టాప్ స్టార్స్ ఇమేజ్ కు తగ్గట్టు పాటలు పలికించడంలోనూ తన మార్కు చూపించారాయన. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మోహన్ బాబు, వెంకటేశ్ వీరందరి సినిమాల్లోనూ భువనచంద్ర పాటలు తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. నవతరం హీరోలయిన పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ చిత్రాలకు సైతం భువనచంద్ర తనదైన పదకేళితో పాటలు రాసి మురిపించారు.

మన టాప్ స్టార్స్ చిత్రాల్లోనే కాదు, వర్ధమాన కథానాయకుల సినిమాల్లోనూ భువనచంద్ర పాటలు ప్రముఖ పాత్ర పోషించాయి. రాజేంద్రప్రసాద్, ఆలీ, జగపతిబాబు, వినోద్ కుమార్, తరుణ్ వంటి హీరోల మరపురాని చిత్రాల్లోనూ భువనచంద్ర పాటలు పరవశింప చేశాయి. అనువాద చిత్రాల్లోనూ భువనచంద్ర తనదైన బాణీ పలికించారు. అనేక డబ్బింగ్ సినిమాల్లో భువనచంద్ర పాటలు ఎంతగానో పరవశింప చేశాయి.

ఇక ఆయన కలం నుండి జాలువారిన అనేక పాటలు ప్రస్తుతం రీమిక్స్ రంగు పులుముకొని అలరిస్తూ ఉండడం మరింత విశేషం. చిరంజీవి నటవారసుడు రామ్ చరణ్ ‘మగధీర’లో భువనచంద్ర కలం పలికించిన ‘బంగారు కోడి పెట్ట…’ పాట రీమిక్స్ గా మారి ఎంతలా అలరించిందో అందరికీ తెలిసిందే. చిరంజీవి ‘ఘరానామొగుడు’ కోసం అప్పట్లో కీరవాణి బాణీలకు భువనచంద్ర సాహిత్యం సమకూర్చారు. మళ్ళీ అదే కీరవాణి స్వరాల్లోనే ఆ పాట రీమిక్స్ కావడం విశేషం. ‘గ్యాంగ్ లీడర్’లోని “వానా వానా వెల్లువాయె…” పాటను రామ్ చరణ్ తన ‘రచ్చ’లో రీమిక్స్ చేసుకొని ఫ్యాన్స్ ను మురిపించారు. చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ మావయ్య ‘ఖైదీ నంబర్ 786’లోని “గువ్వా గోరింకతో…” పాటను తన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’లో ఉపయోగించుకొని ఆకట్టుకున్నారు. మరో మేనల్లుడు అల్లు శిరీష్ అదే ‘ఖైదీ నంబర్ 786’లోని ఐటమ్ సాంగ్ “అటు అమలాపురం…ఇటు పెద్దాపురం…” సాంగ్ పై మనసు పారేసుకొని, తన ‘కొత్తజంట’లో పెట్టేసుకున్నారు. మెగాఫ్యామిలీ ముచ్చట ఇలా ఉంటే, నందమూరి కళ్యాణ్ రామ్ కూడా తన బాబాయ్ బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ ‘రౌడీ ఇన్ స్పెక్టర్ ‘లో భువనచంద్ర పలికించిన ‘అరె ఓ సాంబా..’ పాటను రీమిక్స్ చేసుకున్నారు. తన ‘పటాస్’ చిత్రంలో ఈ రీమిక్స్ ఉపయోగించుకొని హిట్టు పట్టేశారు కళ్యాణ్ రామ్. ఇలా రీమిక్స్ ల్లో భువనచంద్ర పాటలపైనే కుర్రహీరోలు ఆసక్తి చూపించడం విశేషమే కదా!

పలు విశేషాలకు వేదికగా నిలచిన భువనచంద్ర గీతాలు భావితరాలను సైతం పులకింప చేస్తూనే ఉంటాయని చెప్పవచ్చు. భువనచంద్ర మరిన్ని వసంతాలు చూస్తూ మరెన్నో మధురగీతాలను పలికించాలని ఆశిద్దాం.