NTV Telugu Site icon

రివ్యూ : లూజర్ సీజన్ 2 (వెబ్ సీరిస్)

loser

loser

దాదాపు యేడాదిన్నర క్రితం అన్నపూర్ణ స్టూడియోస్, జీ 5, స్పెక్ట్రమ్ మీడియా నెట్ వర్క్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంది ‘లూజర్’ వెబ్ సీరిస్. కరోనా ఫస్ట్ వేవ్ పీక్స్ లో ఉండి, థియేటర్లు మూతపడిన టైమ్ లో అంటే… 2020 మే 15న ‘లూజర్’ ఫస్ట్ సీజన్ కు సంబంధించిన మొత్తం పది ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అయ్యాయి. మళ్ళీ ఇంతకాలానికి అదే వెబ్ సీరిస్ సీజన్ 2కు సంబంధించిన ఎనిమిది ఎపిసోడ్స్ శుక్రవారం నుండి జీ 5లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

మూడు వేరువేరు సమయాలలో తమ కెరీర్ లో లూజర్స్ గా మిగిలిపోయిన ముగ్గురి కథ ఇది. ఎయిర్ రైఫిల్‌ షూటర్ సూరి యాదవ్‌ (ప్రియదర్శి); షటిల్ ఆడాలని కలలు కని నిఖాతో వాటిని చెరిపేసుకున్న రూబి షబానా (కల్పిక గణేశ్‌); ఫాస్ట్ బౌలర్ గా పేరు తెచ్చుకోవాలనుకుని ఆవేశంతో క్రీడామైదానం వదిలేసిన క్రికెటర్ విల్సన్ (శశాంక్) జీవితాలకు ఇది కొనసాగింపు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సంపాదించుకున్న సూరి కి రైల్వేలో క్లర్క్ గా జాబ్ వస్తుంది. దానితో తృప్తి పడుతున్న సమయంలోనే అతని జీవితంలోకి మాయా (ధన్య బాలకృష్ణన్) అనే అమ్మాయి అడుగుపెడుతుంది. జీవితంలో సాధించాల్సింది ఎంతో ఉందనే విషయాన్ని అతనికి అర్థమయ్యేలా చెబుతుంది. దాంతో ఒలింపిక్స్ కు క్వాలిఫై కావడం కోసం తన వంతు ప్రయత్నం చేస్తాడు సూరి యాదవ్‌. కానీ ఆ ప్రయాణంలో అతను పరాజితుడిగా మిగిలిపోతాడు.

ఇక భర్త అరాచకాలను భరించే ఓపిక లేక విడాకులు ఇచ్చి, తనకు నచ్చినట్టుగా జీవితాన్ని సాగించాలనుకుంటుంది రూబి షబానా. షటిల్‌ కోచ్ గా సరికొత్త లైఫ్‌ ను లీడ్ చేయాలనుకునే ఆమెకు తండ్రి నుండి తొలుత ప్రతిబంధకాలు ఎదురైనా చివరకు తన లక్ష్యం వైపు అడుగులు వేస్తుంది. ఇక క్రికెట్ కోచ్ గా స్థిరపడిపోయి, భారంగా జీవితాన్ని సాగిస్తున్న విలన్స్ కు అతని కొడుకు ఓ ఆశాకిరణంగా కనిపిస్తాడు. క్రికెటర్ కావాలనే తన కోరికను తండ్రికి చెప్పి, చివరకు ఒప్పిస్తాడు. కొడుకు సాధించిన విజయంతో విల్సన్ తృప్తిపడతాడు. అయితే… విజయం అనేది ఎప్పుడూ స్థిరంగా ఉండదని, దాన్ని కాపాడుకోవడానికి మనిషి నిరంతరం పోరాటం చేయాలని, ఈ ముగ్గురు కూడా తమ తాజా లక్ష్యాలను చేరడానికి ఎలాంటి కృషి చేస్తారో వేచి చూడాలన్నట్టుగా ఈ వెబ్ సీరిస్ కు ముగింపు పలికాడు దర్శకుడు. సో… నెక్ట్స్ సీజన్ లో దానికి సంబంధించిన కథ మనం చూడబోతున్నాం. సో… ప్రారంభం – ముగింపు మధ్య సాగే కథనే ఈ రెండో సీజన్ లో మనం చూసినట్టు!

మొదటి సీజన్ లో పాత్రల పరిచయం, వారి లక్ష్యాలు, వాటిని అందుకోవడంలో ఎదురైన ఇబ్బందులు, వాటిని అధిగమించే క్రమంలో తెలిసో తెలియకో వారు చేసిన తప్పులు, అయిన వాళ్ళకు దూరం కావడం… ఇలా ఆ పది ఎపిసోడ్స్ లోనూ బోలెడంత డ్రామా ఉంది. అందువల్ల జనం బాగా కనెక్ట్ అయ్యారు. ఆ రకంగా చూస్తే…. ఈ సెకండ్ సీజన్ లో ఆ డ్రామా చాలా చాలా తక్కువే. పైగా కథ చాలా ఫ్లాట్ గా సాగిపోయింది. ఏ ఒక్క ఎపిసోడ్ కూడా భలే ఉంది అనిపించలేదు. మొత్తం ముగ్గురిలో సూరికి సంబంధించిన కథ మీదనే డైరెక్టర్స్ అభిలాష రెడ్డి, శ్రవణ్ మాదాల ఎక్కువ దృష్టి పెట్టారు. దాంతో అతనికి సంబంధించిన కథ కాస్తంత విపులంగా చెబుతూ, మధ్య మధ్యలో విల్సన్, రూబీ కథలు చెబుతూ వచ్చారు. అయితే సూరి, అతని బాస్ గోవర్థన్ మధ్య క్లాష్‌; విల్సన్, అతని పాత ప్రత్యర్ఙితో క్లాష్‌; రూబి ఆమె భర్త మధ్య క్లాష్‌… ఇవేవీ బలంగా చూపించలేదు. ఉండటానికి మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నా… ఒక్కొక్కటీ అరగంట కూడా లేకపోవడంతో ఇలా మొదలై అలా అయిపోయినట్టే అనిపించింది. కథలో ఊహకందని మలుపులూ లేకపోవడం నిరాశకు గురి చేస్తుంది.

ఆర్టిస్టుల నుండి పెర్ఫార్మెన్స్ రాబట్టడంలో దర్శకులు సక్సెస్ అయ్యారు. అందరూ చాలా చక్కగా ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. ప్రియదర్శి ఎప్పటిలానే తన పాత్రకు సంపూర్ణ న్యాయం చేకూర్చాడు. అలానే బేబీ రూబిగా యాని, పెద్ద రూబిగా కల్పిక గణేశ్‌, ఆమె తల్లిదండ్రులుగా సత్య కృష్ణన్‌, షాయాజీ షిండే చక్కగా నటించారు. ఈ సీజన్ కు ధన్య బాలకృష్ణన్ స్పెషల్ అట్రాక్షన్ అనుకోవాలి. చివరి ఎపిసోడ్ లో ఆమెకు సంబంధించిన మిస్టరీని రివీల్ చేయడం బాగుంది. ఆ ఒక్క సీన్ తో ఆమె మెంటాలిటీ ఏమిటీ అనేది వ్యూవర్స్ అర్థం చేసుకునేలా చేశారు. మొదటి సీజన్ లో మాదిరే ఇందులో అన్ని పాత్రలకు చక్కని ప్రాధాన్యం ఇచ్చారు. సంభాషణలూ చాలా బాగున్నాయి. కానీ కథను కాస్తంత మలుపు తిప్పే సన్నివేశాలు మరికొన్ని ఉంటే… సీజన్ త్రీ మీద వ్యూవర్స్ కు కాస్తంత ఆసక్తి కలిగి ఉండేది. రూబి స్నేహితురాలి పాత్రలో సునయన కనిపించింది కాసేపే అయినా కాస్తంత ఎంటర్ టైన్ చేసింది. వెంకట్ కూడా చివరి రెండు ఎపిసోడ్స్ లోనే కనిపించాడు. ఇక శశాంక్ ను వయసున్న వాడిగా మేకప్ తో మేనేజ్ చేస్తే సరిపోయే దానికి పెద్ద పొట్ట ఒకటి పెట్టి చికాకు పుట్టించారు. అది లేకుండా ఉంటేనే… అతను ఇంకా ఆ పాత్రను చక్కగా చేసి ఉండేవాడేమో అనిపించింది. శశంక్ తనయుడిగా హర్షిత్ రెడ్డి చక్కని ఎమోషన్స్ పండించాడు. ఇతర ప్రధాన పాత్రలను రవివర్మ, అభయ్, పావని, శిశిర్ శర్మ, గాయత్రి భార్గవి, తారక్ పొన్నప్ప తదితరులు పోషించారు. నరేశ్‌ రామదురై సినిమాటోగ్రఫీ, సాయి శ్రీరామ్ మద్దూరి సంగీతం బాగానే ఉంది.

ఒకటి మాత్రం వాస్తవం. ‘లూజర్’ ఫస్ట్ సీజన్ నాటికి తెలుగులో వెబ్ సీరిస్ లు అంతగా రాలేదు. దాంతో అది చాలామందికి గొప్పగా అనిపించి ఉండొచ్చు. అంతే కాదు ఈ వెబ్ సీరిస్ మీద అంచనాలు ఏర్పడ్డాయి. కానీ వారి అంచనాలను ఇది అందుకోలేకపోయింది. పైగా గడిచిన ఏడాదిన్నర కాలంలో వివిధ ఓటీటీ మాధ్యమాలలో చాలా భారీ స్థాయిలో రూపుదిద్దుకున్న వెబ్ సీరిస్ లు ప్రసారం అయ్యాయి. అందులో స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. వాటిని దృష్టిలో పెట్టుకుని మరింత గ్రాండ్ గా, మరింత కథాబలంతో ‘లూజర్’ సీజన్ 2ను నిర్మించి ఉండాల్సింది. కనీసం రాబోయే సీజన్స్ తీసేప్పుడైనా, మేకర్స్ ఈ విషయాన్ని గుర్తిస్తే మంచిది. లేదంటే మొదటి సీజన్ ద్వారా తెచ్చుకున్న పేరును నిదానంగా కోల్పోవాల్సి ఉంటుంది.

ప్లస్ పాయింట్స్
ఫస్ట్ సీజన్ కు వచ్చిన గుర్తింపు
నటీనటుల అభినయం
ఆకట్టుకునే సంభాషణలు

మైనెస్ పాయింట్స్
కథ, కథనాల్లో లేని కొత్తదనం
అంచనాలను అందుకోలేకపోవడం

రేటింగ్: 2.5 / 5

ట్యాగ్ లైన్: తడబడిన ‘లూజర్’!