వందల కోట్లు ఖర్చు పెట్టి, సంవత్సరాల కొద్దీ టైమ్ ని స్పెండ్ చేసి ఒక సినిమా చేస్తారు. ఏ ఇండస్ట్రీలో అయినా రెగ్యులర్ గా జరిగే విషయమే ఇది. అయితే సినిమాని ఎంత గొప్పగా తీసాం అనే విషయం ఎంత ముఖ్యమో, సినిమాని ఎంతగా ప్రమోట్ చేస్తున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. రాజమౌళి ఈ విషయాన్ని ఫాలో అయినంతగా మరో దర్శకుడు ఫాలో అవ్వడు. ప్రమోషన్స్ ఇంపార్టెన్స్ ని ఈ మధ్య కాలంలో ప్రతి దర్శకుడు, ప్రతి హీరో తెలుసుకున్నారు అందుకే సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఇండియా మొత్తం తిరుగుతున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది, సినిమా చేసిన తర్వాతో, షూటింగ్ మధ్యలోనో, రిలీజ్ డేట్ కి ఒక నెల రోజుల ముందు మాత్రమో తమ సినిమాల ప్రమోషన్స్ ని మొదలుపెడుతున్నారు. ఈ కారణంగా కొన్ని సినిమాలకి ఆశించిన స్థాయిలో బజ్ జనరేట్ అవ్వట్లేదు, హడావుడి హడావుడిగా ప్రమోషన్స్ చేసేస్తున్నారు.
రిలీజ్ కి కొన్ని రోజుల ముందు నుంచి కాదు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన రోజు నుంచే ప్రమోషన్స్ చెయ్యాలి, అప్పుడు సాలిడ్ బజ్ క్రియేట్ అవుతుంది అని ప్రూవ్ చేస్తున్నారు దర్శకుడు లోకేష్ కనగరాజ్, సుజిత్. లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం దళపతి విజయ్ తో ‘లియో’ సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ తోనే హైప్ క్రియేట్ అయ్యింది, ఆ అంచనాలని పెంచుతూ ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ ని బయటకి వదులుతునే ఉన్నారు. లాంచ్ చేసిన రోజే కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్, షూట్ ఫస్ట్ డే అయిన వెంటనే ‘లియో’ టైటిల్ అనౌన్స్మెంట్, విజయ్ లుక్ ని రివీల్ చేస్తూ ఒక వీడియో, సంజయ్ దత్ సెట్స్ లోకి ఎంటర్ అయ్యే సమయంలో ఒక వీడియో, కాశ్మీర్ షెడ్యూల్ అయిపోగానే టెక్నికల్ టీమ్ కి సంబంధించిన ఒక వీడియో… ఇలా ఎప్పటికప్పుడు ప్రమోషనల్ కంటెంట్ ని వదులుతూ ప్రేక్షకుల్లో ‘లియో’ సినిమాపై హైప్ పెంచుతూనే ఉన్నారు. లియో సినిమా దీపావళికి రిలీజ్ అవ్వనుంది అప్పటివరకు ఇదే మైంటైన్ చేస్తూ వెళ్లేలా లోకేష్ కనగారాజ్ ప్లాన్ చేశాడు.
సుజిత్ కూడా ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ‘OG’ సినిమా చేస్తున్న సుజిత్, లాంచ్ అయిన రోజు నుంచి ప్రమోషన్స్ ని మొదలుపెట్టాడు. టైటిల్, లొకేషన్ స్కౌటింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఆడియన్స్ ని ఇచ్చిన సుజిత్, షూటింగ్ మొదలుపెడుతూ ఒక ప్రమోషనల్ వీడియోని కూడా రిలీజ్ చేశాడు. దీని కారణంగా ‘OG’పై అంచనాలు మరింత పెరిగాయి. పవన్ కళ్యాణ్ షూటింగ్ లో జాయిన్ అయిన తర్వాత ఒక వీడియోని కానీ ఫోటోని కానీ రిలీజ్ చేస్తే “OG” హైప్ ఆకాశాన్ని తాకే రేంజులో ఉంటుంది. ఇలా అనౌన్స్మెంట్ రోజు నుంచే ప్రమోట్ చెయ్యడం వలన సినిమాకి మంచి బజ్ వస్తుంది, ఎక్కువ రోజు జనాల్లో ఈ సినిమా పేరు వినిపిస్తూనే ఉంటుంది, బిజినెస్ త్వరగా అవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకోని ఇతర దర్శక నిర్మాతలు హీరోలు కూడా తమ సినిమాలని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ప్రమోషన్స్ చేస్తే ఇప్పుడు పెడుతున్న మితిమీరిన బడ్జట్ లు కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది.
