ఇప్పుడు తరచూ ‘పాన్ ఇండియా మూవీ’ అంటూ వినిపిస్తోంది. అసలు ‘పాన్ ఇండియా మూవీ’ అంటే ఏమిటి? భారతదేశమంతటా ఒకేసారి విడుదలయ్యే చిత్రాన్ని ‘పాన్ ఇండియా మూవీ’ అన్నది సినీపండిట్స్ మాట! కొందరు ఉత్తరాదిన హిందీలోనూ, దక్షిణాది నాలుగు భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ సీమల్లో విడుదలయ్యే సినిమాలు అంటూ చెబుతున్నారు. ఇప్పుడంటే కన్నడ, మళయాళ సీమల్లోనూ సినిమాలకు క్రేజ్ ఉంది కానీ, ఒకప్పుడు దక్షిణాదిన సినిమా అంటే తెలుగు, తమిళ చిత్రాలే! ఉత్తరాదిన హిందీ, బెంగాలీ మూవీస్ ఉండేవి. ఇప్పుడు హిందీ సినిమాలనే బెంగాలీలోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ విడుదల చేస్తున్నారు కాబట్టి ఉత్తరాది అంతటా ‘పాన్ ఇండియా మూవీస్’ విడుదలవుతాయని భావించవచ్చు. ఇంత హంగామా లేని రోజుల్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైన చిత్రాలనే ఆల్ ఇండియాలోని ప్రధాన రాష్ట్రాలలో రిలీజ్ చేసేవారు. ఆ తీరున నటరత్న యన్టీఆర్ ఏ నాడో ‘పాన్ ఇండియా మూవీ’లో నటించారు. యన్టీఆర్ చిత్రసీమలో అడుగు పెట్టిన నాలుగేళ్ళకే మహానటి భానుమతి నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘చండీరాణి’ని మూడు భాషల్లోనూ రూపొందించారు. ఈ సినిమా 1953 ఆగస్టు 28న మూడు భాషల్లో ఒకేసారి విడుదలయింది. కావున, యన్టీఆర్ 70 ఏళ్ళ క్రితమే ‘పాన్ ఇండియా మూవీ’లో నటించారన్న విషయాన్ని మరువరాదు. ‘చండీరాణి’ చిత్రం తెలుగులో కన్నా మిన్నగా, తమిళ, హిందీ భాషల్లో ఆదరణ పొందింది. మూడు భాషల్లోనూ వందరోజులు చూడడం విశేషం!
అంతకు ముందు యన్టీఆర్ హీరోగా కేవీ రెడ్డి రూపొందించిన ‘పాతాళభైరవి’ చిత్రం తొలుత తెలుగు, తమిళ భాషల్లో 1951 మార్చి 15న విడుదలయింది. ఈ సినిమా ఘనవిజయం సాధించాక, తరువాత హిందీలో జెమినీ సంస్థ ‘పాతాళభైరవి’ని యన్టీఆర్, యస్వీఆర్, మాలతితోనే రీమేక్ చేశారు. 1952లో విడుదలైన హిందీ ‘పాతాళభైరవి’ మంచి విజయం చూసింది. దాంతో జూపిటర్ సంస్థ యన్టీఆర్ తో తెలుగు, హిందీ భాషల్లో ‘సంతోషం’ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా 1955 డిసెంబర్ 24న తెలుగులో ‘సంతోషం’గానూ, 1956 జనవరి 1న హిందీలో ‘నయా ఆద్మీ’గానూ విడుదలయింది. ఈ చిత్రం కూడా తెలుగులో కన్నా మిన్నగా ఉత్తరాదిన ఘనవిజయం సాధించింది. బొంబాయిలో ఏకధాటిగా 42 వారాలు ప్రదర్శితమై, షిఫ్ట్ మీద గోల్డెన్ జూబ్లీ చూసింది. ఇప్పటి వరకు హిందీలో స్వర్ణోత్సవం చూసిన తెలుగు హీరో ఎవరైనా ఉన్నారంటే అది యన్టీఆర్ అని చెప్పక తప్పదు. ఆ తరువాత హిందీ చిత్రాలలో నటించి, విజయం సాధించిన తెలుగు హీరోలందరూ ‘సిల్వర్ జూబ్లీ’తోనే సరిపుచ్చుకోవడం విశేషం!
యన్టీఆర్ హిందీలో నటించిన చిత్రాలు – పాతాళభైరవి (1952), చండీరాణి (1953), నయా ఆద్మీ (1956) మాత్రమే ఆ పైన రామారావు నటించిన అనేక పౌరాణిక, సాంఘికాలు హిందీ, బెంగాల్ భాషల్లోకి అనువాదమై అక్కడా అలరించాయి. 1957లో యన్టీఆర్ ‘మాయాబజార్’తో అపర శ్రీకృష్ణునిగా పేరు సంపాదించగానే, తరువాతి రోజుల్లో తన శ్రీకృష్ణ పాత్రను, పురాణగాథలను దక్షిణాదికే పరిమితం చేశారు. ఆ పైన అంటే 1960ల ప్రథమార్ధంలో చమ్రియా ఫిలిమ్స్ పంపిణీ సంస్థ అధినేత, రాజలక్ష్మి ప్రొడక్షన్స్ భాగస్వామి అయిన సుందర్ లాల్ నహతా అప్పట్లోనే ‘భగవాన్ శ్రీకృష్ణ’ చిత్రాన్ని నిర్మించాలని భావించి, యన్టీఆర్ ను డేట్స్ అడిగారు. తాను ఇకపై పురాణగాథలు దక్షిణాదికే పరిమితం చేశానని, హిందీ చిత్రాలలో నటించనని చెప్పారు యన్టీఆర్. అయితే అప్పట్లోనే యన్టీఆర్ కు కోటి రూపాయలు (దాదాపు అరవై ఏళ్ల క్రితం కోటి రూపాయలు అంటే ఇప్పటి లెక్కల్లో దాదాపు వేయి కోట్ల రూపాయలు) పారితోషికం ఇస్తామని చెప్పినా, యన్టీఆర్ సున్నితంగా తిరస్కరించారే తప్ప తన మాటను దాటి పోలేదు. అదీ యన్టీఆర్ వ్యక్తిత్వం! అందువల్ల అదే నిర్మాత, తరువాతి రోజుల్లో యన్టీఆర్ నటించిన అనేక పౌరాణిక చిత్రాలను హిందీ, బెంగాల్ భాషల్లో డబ్ చేసి ఎన్నో లాభాలు చూశారు. తరువాత 1991లో యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో నిర్మించారు. ముందుగా తెలుగులో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. తరువాత మరికొన్ని మార్పులు చేర్పులతో హిందీలో రూపొందించి, నిదానంగా విడుదల చేశారు. అలా యన్టీఆర్ నటించిన హిందీ చిత్రాలలో ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ (1993) కూడా చోటు చేసుకుంది. ఏది ఏమైనా తెలుగునాట తనదైన బాణీ పలికించిన యన్టీఆర్ హిందీలోనూ పౌరాణిక, జానపద, సాంఘికాల్లో నటించిన ఘనతను సొంతం చేసుకున్నారు.
