తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, వైవిధ్యభరితమైన చిత్రాలను తెరకెక్కించిన సింగీతం శ్రీనివాసరావుకు సతి వియోగం కలిగింది. ఆయన భార్య లక్ష్మీ కళ్యాణీ చెన్నయ్ లో శనివారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా సింగీతం శ్రీనివాసరావు తెలిపారు. 62 సంవత్సరాల తమ దాంపత్య జీవితానికి తెరపడిందని ఆయన అన్నారు. యుక్త వయసులోనే చిత్రసీమలోకి అడుగుపెట్టిన సింగీతం శ్రీనివాసరావుకు అరవైయేళ్ళకు పైగా ఆమె చేదోడు వాదోడుగా ఉన్నారు.
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కు హాజరు కావడం సింగీతం శ్రీనివాసరావుకు అలవాటు. అయితే తనతో పాటుగా ఆయన ఎన్నో విదేశాలకు, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు భార్య కళ్యాణిని కూడా వెంట తీసుకెళ్ళేవారు. ఆ తర్వాత ఆమెతో కలిసి ఆ సినిమాలు, వాటి కథాకమామీషుపై చర్చించేవారు. తన భర్త సినీ ప్రయాణం గురించి, అందులో తన ప్రమేయం గురించి, పిల్లల పెంపకం గురించి సింగీతం లక్ష్మీ కళ్యాణీ ‘శ్రీ కళ్యాణీయం’ పేరుతో పదేళ్ళ క్రితం ఆత్మకథను రాసి, పుస్తకంగా తీసుకొచ్చారు. ఆమె మృతిపట్ల సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
