‘ఉప్పెన’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ హీరో ఆ తరువాత వరుస సినిమాలను లైన్లో పెట్టి ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే వైష్ణవ్ నటించిన ‘రంగరంగ వైభవంగా’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే వైష్ణవ్ తన నాలుగో సినిమాను ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చాడు. నూతన దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నిన్ననే పూజా కార్యక్రమాలతో మొదలైన విషయం విదితమే. ఇక ఈ చిత్రం మెగా మేనల్లుడు సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించిన ఒక పుకారు నెట్టింట షికారు చేస్తోంది.
అదేంటంటే.. మంచు వారబ్బాయి మంచు మనోజ్ హీరోగా, శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమా తెరకెక్కిన విషయం తెల్సిందే. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా సగం షూటింగ్ జరుపుకొని అటకెక్కిందని సమాచారం. అయితే తాజాగా అందుతున్న వార్త ఏంటంటే ఆ అటకెక్కిన కథనే శ్రీకాంత్ రెడ్డి, వైష్ణవ్ కు వినిపించి సెట్ చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.రాయలసీమ ప్రాంతంలోని ఒక గ్రామంలో జరిగే కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట శ్రీకాంత్ రెడ్డి. ఇప్పటికే విడుదలైన డైలాగ్ మోషన్ పోస్టర్ లో వైష్ణవ్ మాస్ లుక్, రాయలసీమ యాస ఆకట్టుకుంటున్నాయి. అంటే మంచు హీరో వద్దు అన్న కథను మెగా హీరోకు వినిపించి ఓకే చేయించారా..? అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ విషయమై డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.
