KV Anudeep Talks About Venkatesh Project: ఎంట్రీ సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడంతో.. దర్శకుడు కేవీ అనుదీప్ ‘జాతిరత్నం’లా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిపోతున్నాడు. అందుకే.. అతనితో కలిసి పని చేసేందుకు స్టార్లు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఆల్రెడీ ఇతను తమిళ హీరో శివకార్తికేయన్‌తో ఓ బైలింగ్వల్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రిన్స్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాను సునీల్ నారంగ్, పి. రామ్ మోహన్ రావు, డి. సురేశ్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ విక్టరీ వెంకటేశ్‌తో జోడీ కట్టబోతున్నాడని సమాచారం.
నిజానికి.. కొంతకాలం క్రితమే అనుదీప్, వెంకీ కలయికలో ఓ సినిమా ఉండనుందని వార్తలొచ్చాయి. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేశ్ బాబు నిర్మించనున్నట్టు టాక్ కూడా వినిపించింది. కానీ.. ఆ తర్వాత మళ్లీ ఎలాంటి అప్డేట్ రాలేదు. లేటెస్ట్‌గా తాను కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా.. వెంకటేశ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాడు. వెంకటేశ్ కోసం తాను ఓ కథను సిద్ధం చేశానని, త్వరలోనే ఆయనకు వినిపిస్తానని అన్నాడు. ఆయన ఓకే చెప్తే.. వెంటనే పట్టాలెక్కించడం ఖాయమని చెప్పాడు. ఒకవేళ ప్రాజెక్ట్ ఓకే అయితే.. తానే స్వయంగా మీడియాకి వెల్లడిస్తానని చెప్పుకొచ్చాడు. మరి.. వెంకీ అతనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా? అనేది వేచి చూడాలి.
ఇదే సమయంలో తనకు జాతిరత్నాలు 2 తీసే ఆలోచన కూడా ఉందని అనుదీప్ తెలిపాడు. అయితే.. అందుకు మరో రెండు, మూడేళ్ల సమయం పడుతుందని పేర్కొన్నాడు. సీక్వెల్ అన్నాక అంచనాలు ఉంటాయని, వాటిని అందుకునే రీతిలో కథని సిద్ధం చేయాలంటే బాగా కసరత్తు చేయాల్సి ఉంటుందని అనుదీప్ వెల్లడించాడు.
