Site icon NTV Telugu

Anti Hindi drama: తగ్గేదే లే అంటున్న ఖుష్బూ!

Kushboo

Kushboo

ఇటీవల కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సౌత్ రీజన్ ఆధ్వర్యంలో చెన్నయ్ లో ఘనంగా సమ్మెట్ జరిగింది. దాని నిర్వహణకు తనవంతు సహకారాన్ని సంపూర్ణంగా అందించింది సీనియర్ నటి ఖుష్బూ. ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తమిళనాడు సీఎం స్టాలిన్ ను సాదరంగా ఆహ్వానించి, తన తోటి నటీమణులతో కలిసి ఆయనతో ఫోటో కూడా దిగి సోషల్ మీడియాలో ఖుష్బూ పోస్ట్ చేసింది. చిత్రం ఏమంటే… ఆ మధ్య ఖుష్బూ భర్త సుందర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘అరణ్మై -3’ చిత్రాన్ని స్టాలిన్ తనయుడు ఉదయనిధి తన డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారానే విడుదల చేశాడు. అయితే… ఆ మధ్య కాంగ్రెస్ నుండి బీజేపీలోకి చేరిన ఖుష్బూ మాత్రం ఎక్కడైనా బావ కానీ వంగతోట కాదు అన్నట్టుగా ప్రవర్తిస్తోంది. డీఎంకేతో ఉన్న రాజకీయ వైరాన్ని నిర్మొహమాటంగా చాటుతూనే ఉంది. సినిమాలు, వాటి సంబంధిత కార్యక్రమాల సమయంలో స్టాలిన్, ఆయన తనయుడితో సన్నిహితంగా మెలిగినా, రాజకీయాల విషయానికి వచ్చేసరికీ డీఎంకే వ్యవహార శైలిని ఎండగడుతూనే ఉంది.

ఆ మధ్య ఓ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశంలోని ఏ రెండు రాష్ట్రాల అధికారులైనా మాట్లాడుకునేప్పుడు ఇంగ్లీష్ కాకుండా హిందీ మాట్లాడితే బాగుంటుందని అన్నారు. దానిపై బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాల నుండీ తీవ్ర విమర్శలు వచ్చాయి. హిందీ భాషను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై రుద్దుతోందని వారు విమర్శించారు. ఇక డీఎంకే నాయకులైతే బీజేపీ తన హిడెన్ ఎజెండాను బయట పెట్టిందని గోల చేశారు. ఈ విమర్శలకు ఖుష్బూ తగ్గేదే లే అన్నట్టు దీటుగా సమాధానం ఇచ్చింది. ”డీఎంకే పార్టీ హిందీ వ్యతిరేక నాటకాన్ని చాలా బాగా రక్తి కట్టిస్తుంటుందని, ఆ భాష మీద అభిమానం లేకపోతే ఆ పార్టీ ఎంపీలు దానిని నేర్చుకోకుండా ఉంటే సరిపోతుందని, హిందీ నేర్చుకుంటే బాగుంటుందని అమిత్ షా సూచించారు తప్పితే బలవంతం చేయలేదని, కానీ కొందరు దీన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నార’ని ఖుష్బూ తెలిపింది.

‘దాదాపు 36 సంవత్సరాలుగా తమిళనాడులో ఉన్న తనను ‘తమిళాచ్చి’గా ఎవరైనా పిలిస్తే గర్వపడతానని, తమిళ భాష పట్ల తనకు అత్యన్నత గౌరవం ఉందని, అలానే తమిళనాడు పట్ల ఉన్న ప్రేమను మాటల్లో వర్ణించలేనని, చెన్నై తన గుండె చప్పుడ’ని ఖుష్బూ చెప్పింది. దీన్ని అర్థం చేసుకోకుండా కొందరు ఇతరుల మాటలను విని ఆలోచనారాహిత్యంతో మోసపోవడం బాధను కలిగిస్తోందని ఖుష్బూ వాపోయింది. నిజానికి కొత్త భాషను నేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది తప్పితే నష్టం ఉండదని, ఈ తరం పిల్లలు రెక్కలు విప్పి ఎగరడానికి సిద్ధంగా ఉన్నారని, వారికి ఏదైనా నేర్చుకునే స్వేచ్ఛను ఇవ్వాలని తెలిపింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం తమిళ సంస్కృతి పట్ల ఎంతో ప్రేమ చూపిస్తుంటారు’అని ఖుష్బూ చెప్పింది. మరి ఆమె మాటలపై డీఎంకే వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

Exit mobile version