సినిమాకు సామాజిక ప్రయోజనం ఉండాలని అంటుంటారు. అయితే అరుదుగా అలాంటి సినిమాలు
వస్తుంటాయి. మలయాళంలో ఇటీవల వచ్చిన ‘కురుతి’ సినిమా ఆ కోవకే చెందుతుంది. ‘కురుతి’ అంటే తెలుగులో రక్తం అనే అర్థం వస్తుంది. మనుషుల మధ్య క్షీణిస్తున్న సామరస్యాన్ని, సోదర భావాన్ని చూపించటమే కాకుండా దేవుని పేరిట జరిగే అర్ధ రహిత హింసను హైలైట్ చేస్తూ రూపొందించిన సినిమా ఇది. మను వారియర్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. ఈ సినిమాను పృథ్వీరాజ్ సుకుమారన్ నిర్మించటం విశేషం.
కథలోకి వస్తే ఇబ్రహీం (రోషన్ మాథ్యూ) తన భార్య జీనాథ్, కుమార్తె జుహ్రూ, అతని తండ్రి మూసా ఖాదర్ (మాముక్కోయ) సోదరుడు రసూల్ (నస్లెన్) తో కలిసి కేరళలోని ఈరట్టుపేటలో సాధారణ జీవితం గడుపుతుంటారు. గ్రామంలో కొండచరియలు విరిగి పడి ఇబ్రహీం కుమార్తె, భార్యను కోల్పోతాడు. పొరుగున ఉన్న ప్రేమన్ (మణికందరాజన్) భార్య కూడా మరణిస్తుంది. ఇబ్రహీం (ఇబ్రు) కుటుంబ జ్ఞాపకాలతో నిద్రపోలేకపోతాడు. ఇక ప్రేమన్ సోదరి సుమతి(స్రిందా) ఇబ్రూకు బట్టలు ఉతకడం, ఇంటి పనులలో సహాయపడుతూ ఇండైరెక్ట్ గా తనని ప్రేమిస్తున్నానని చెబుతుంది. ఓ దురదృష్టకరమైన రాత్రి విష్ణు (సాగర్ సూర్య) అనే నిందితుడితో S.I సత్యన్ (మురళీ గోపీ) ఇబ్రహీం ఇంట్లోకి బలవంతంగా ఎంటర్ అవుతాడు. విష్ణు తన మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు ఓ వ్యక్తిని హత్య చేశాడు. దాంతో అతడిని ఎలాగైనా చంపాలనే ఓ వర్గంవెంటాడుతుంది. అయితే సత్యన్ అలా జరగకూడదని భావిస్తాడు. ఇబ్రూ ఇంటిలోని విష్ణుని చంపటానికి ప్రయత్నిస్తున్న ఇబ్రు స్నేహితుడు కరీమ్, విష్ణుని అంతం చేయటమే లక్ష్యంగా ఉన్న లైక్ (పృథ్వీరాజ్ సుకుమారన్) వర్గం కూడా ఎంటరవుతుంది. కొన్ని మలుపుల తరువాత విష్ణు జీవితాన్ని రక్షించే బాధ్యత ఇబ్రహీం మీద పడుతుంది. అతను తన స్నేహితుల ప్రతీకారానికి మద్దతు ఇస్తాడా? లేక పరమతానికి చెందిన అపరిచితుడి ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నిస్తాడా? చివరికి ఏం జరిగిందన్నదే కథ.
నిజానికి ఇలాంటి కథను ఎంచుకోవడం కత్తిమీద సామే. దానిని ఎలాంటి గందరగోళం లేకుండా
తెరకెక్కించటం, అదీ ఏ మతానికి చెందిన వారినీ నొప్పించకుండా చేయటం అనే విషయంలో దర్శకుడు చూపించిన నేర్పుకు హాట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ కథతో వచ్చిన దర్శకుడికి స్వాగతం చెప్పి సినిమా తీయటమే కాకుండా అందులో మత విశ్వాసాలను నరనరానా ఎక్కించుకున్న లైక్ పాత్రను పోషించిన పృథ్వీరాజ్ సుకుమారన్ ను అభినందించాల్సిందే. సంవత్సరాలుగా సన్నిహితులుగా మెలిగిన వ్యక్తులు మతపరమైన విషయం వచ్చే సరికి ఒకే రాత్రిలో ఎలా శత్రువులుగా మారతారనే అంశాన్ని చక్కగా చూపించాడు దర్శకుడు. నటీనటుల విషయానికి వస్తే ఇబ్రూగా నటించిన మ్యాథ్యూ రోషన్, లైక్ పాత్ర పోషించిన పృథ్వీరాజ్ సుకుమారన్, ఇబ్రుని అభిమానించే సుమతిగా స్రిందా,ఇబ్రు తండ్రి పాత్ర పోషించిన మాముక్కోయ, సోదరుడు రసూల్ గా నస్లెన్ విష్ణుగా సాగర్ సూర్య తమ తమ పాత్రల్లో జీవించారనే చెప్పాలి. సినిమా కథకు అనుగుణంగా 90శాతం పైగా రాత్రివేళలో చిత్రీకరించిన సినిమాటోగ్రాఫర్ రామానుజం, చక్కటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన జేక్స్ బిజోయ్ ప్రతిభను తక్కువ చేయలేం. థ్రిల్లర్ గా రూపొందిన ‘కురుతి’ శక్తిమంతమైన సందేశాన్ని అందిస్తుంది. సమాజంలో పెరుగుతున్న మతధోరణిని దర్శకుడు స్పృసించిన తీరు అందరినీ మెప్పిస్తుంది. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా చూసి తీరవలసిన సినిమా ఇది.
ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న కథాంశం
దర్శకత్వ ప్రతిభ
నటీనటుల నటన
కెమెరా,
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్
పూర్తిగా చీకటిలో జరగటం
అస్పష్టమైన ముగింపు
రేటింగ్: 3.25/5
ట్యాగ్ లైన్: రక్తపు ఆట