Custody: అక్కినేని నాగ చైతన్య, కృతిశెట్టి జంటగా నటించిన ద్విభాషా చిత్రం ‘కస్టడీ’. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా తన పాత్ర గురించి, మూవీ విశేషాలను గురించి కృతి శెట్టి మీడియాతో మాట్లాడింది. ఈ సినిమా కథలోని వైవిధ్యం గురించి చెబుతూ, “సహజంగా మన సినిమాల్లో హీరో, విలన్ ను అంతం చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ‘కస్టడీ’లో మాత్రం హీరో విలన్ ని కాపాడటానికి ప్రయత్నిస్తాడు. ఇది చాలా ఆసక్తికరంగా వుంటుంది. ఇక నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే… ఇది చాలా ప్రాధాన్యం ఉన్న పాత్ర. కథ సీరియస్ అవుతున్నప్పుడు నా పాత్ర దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. స్క్రీన్ ప్లే తో నా పాత్ర ప్రయాణిస్తూ వుంటుంది. నటనకు ఆస్కారం వుండే పాత్ర. నా పాత్ర నిడివి కూడా ఎక్కువే. సాధారణంగా సినిమాలకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాం. బట్ ‘కస్టడీ’ కోసం జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేశాను. ఇది యాక్షన్ ఎంటర్ టైనర్. నా పాత్రలో మంచి ఎమోషన్ వుంటుంది” అని అన్నారు.
ఈ సినిమాలోని అండర్ వాటర్ సీక్వెన్స్ చిత్రీకరణ గురించి కృతి వివరిస్తూ, “దాదాపు 15 రోజులు అండర్ వాటర్ సీక్వెన్స్ చేశాం. ఒక ఐదు రోజుల పాటు కంటిన్యూ గా వాటర్ లోనే వున్నాం. దాని కోసం రెండు రోజులు శిక్షణ తీసుకున్నాం. ఊపిరి తీసుకోకుండా రెండు నిముషాలు పాటు వుంటేనే ఒక షాట్ సాధ్యపడుతుంది. ఒక దశలో నాకు భయం వేసింది. నా కో-స్టార్ నాగచైతన్య గురించి చెప్పాలంటే… అతను నా ఫేవరట్ నటుడే కాదు వ్యక్తి కూడా. చాలా నిజాయితీగా వుంటారు. ఈ కథలో పాత్రలు చాలా కంఫర్ట్ బుల్ గా వుండాలి. నేను ఆఫ్ స్క్రీన్ చై తో కంఫర్ట్ బుల్ గా వుంటాను కాబట్టి ఆన్ స్క్రీన్ కూడా చక్కగా వర్క్ అవుట్ అయ్యింది. పైగా ఆయనతో రెండో సారి వర్క్ చేశాను కాబట్టి కంఫర్ట్ గా ఫీల్ అయ్యాను. అలాగే అరవింద్ స్వామి, శరత్ కుమార్, సంపత్, వెన్నెల కిషోర్ వీళ్ళందరితో వర్క్ చేయడం మంచి అనుభూతిని ఇచ్చింది” అని తెలిపింది. జయాపజయాల గురించి కృతి మాట్లాడుతూ, “ఎవరికీ సక్సెస్ రెసెపీ తెలీదు. మన ప్రయత్నం మనం చేస్తాం. జయాపజయాలు ప్రయాణంలో భాగమే. అయితే అపజయం వచ్చినపుడు దాన్ని విశ్లేషించుకొని మళ్ళీ అలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటాను” అని చెప్పింది. ప్రస్తుతం శర్వానంద్ తో ఓ సినిమాలో నటిస్తున్న కృతిశెట్టి, మలయాళంలోనూ ఓ చిత్రం చేస్తోంది. అలానే మరి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయని, వాటిని మేకర్స్ అనౌన్స్ చేస్తారని తెలిపింది.