తెలుగులో ఎక్కువగా కమర్షియల్ సినిమాలే వస్తుంటాయి. కానీ తమిళం, మలయాళం లాంటి భాషల్లో మాత్రం కొత్త కాన్సెప్టులతో వచ్చే మూవీస్‌కి ప్రత్యేక స్థానం ఉంటుంది. అలా ప్రేక్షకుల హృదయాలను తాకిన ఓ తమిళ ఫాంటసీ రొమాంటిక్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఆ సినిమా పేరు ‘కిస్’. ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న తర్వాత, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయింది.
Also Read : Amitabh Bachchan: దిల్జీత్ నమస్కారం – సిక్కుల ఆగ్రహం.. అమితాబ్‌పై కొత్త వివాదం
‘పాపా’, ‘బ్లడీ బెగ్గర్’ వంటి చిత్రాలతో తెలుగువారికి కూడా పరిచయమైన తమిళ హీరో కవిన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. హీరోయిన్‌గా ప్రీతి ఆస్రానీ నటించింది. సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రొమాన్స్‌తో పాటు ఫాంటసీ టచ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం నవంబర్ 7న జీ5 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేశారు.
ఇక కథ విషయానికొస్తే.. చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయిన నెల్సన్ (కవిన్) తల్లి దగ్గర పెరుగుతాడు. ప్రేమ, రొమాన్స్ అనే ఫీలింగ్స్ తన జీవితంలో ఎప్పుడూ లేవు. కానీ ఒక రోజు అనుకోకుండా అతడి చేతికి ఒక మిస్టీరియస్ బుక్ వస్తుంది. ఆ పుస్తకానికి అద్భుతమైన శక్తి ఉంటుంది. ఎవరైనా అతడి ముందు ముద్దు పెట్టుకుంటే, వారి భవిష్యత్తు ఎలా ఉండబోతోందో నెల్సన్‌కి వెంటనే తెలుస్తుంది. ఆ క్రమంలోనే ఆ బుక్ ఇచ్చిన సారా (ప్రీతి ఆస్రానీ) జీవితం గురించి అతనికి తెలిసిపోతోంది. ఆ తర్వాత జరుగుతున్న ట్విస్టులే కథలో హైలైట్. ప్రస్తుతం తమిళ వెర్షన్ మాత్రమే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నా, త్వరలో తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఫాంటసీ, రొమాన్స్, సస్పెన్స్ కలయికగా ఉన్న ఈ సినిమా యూత్ ఆడియెన్స్‌కి బాగా నచ్చేలా ఉంది. లైట్‌హార్టెడ్ రొమాంటిక్ మూవీస్ అంటే ఇష్టముంటే ‘కిస్’ని ఓసారి తప్పకుండా చూడొచ్చు.
