వందో సినిమా ఏ హీరోకైనా చాలా స్పెషల్ గా ఉంటుంది. అప్పటివరకూ చేసిన 99 సినిమాలకి పూర్తి భిన్నంగా ఏదైనా చేయాలని హీరోలు ప్లాన్ చేస్తుంటారు. చిరు 100వ సినిమా ‘త్రినేత్రుడు’ కాగా బాలయ్యకి 100వ సినిమా ‘గౌతమీ పుత్ర శాతకర్ణీ’. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి, ఇప్పుడు తన వందో సినిమాతో అలాంటి హిట్ కొట్టాలనే ప్లాన్ వేస్తున్నాడు కింగ్ నాగార్జున. ‘ది ఘోస్ట్’తో 99 సినిమాలు కంప్లీట్ చేసిన నాగార్జున, మైల్ స్టోన్ మూవీని ఎవరితో చేయాలా అనే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న న్యూస్ ప్రకారం అయితే నాగార్జున బెంచ్ మార్క్ మూవీని ‘మోహన్ రాజా’ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’ సినిమాని డైరెక్ట్ చేసిన మోహన్ రాజా చేతిలో తన వందో సినిమా బాధ్యతని పెట్టడానికి నాగ్ ప్రిపేర్ అవుతున్నాడట. చిరు లాంటి స్టార్ హీరోని మోహన్ రాజా చూపించిన విధానం నచ్చి నాగార్జున అతనికి ఈ అవకాశం ఇచ్చాడని సమాచారం. ఎక్కువగా రీమేక్ సినిమాలే చేసి హిట్స్ కొట్టిన మోహన్ రాజా, సొంతకథతో ‘తనీ ఒరువన్’ లాంటి కమర్షియల్ హిట్ కొట్టాడు. ఈ సినిమాతో మోహన్ రాజా కెరీర్ మరింత ఊపందుకుంది. ప్రస్తుతం మోహన్ రాజా నాగార్జున కోసం కథ రెడీ చేసే పనిలో ఉన్నాడట. ఫైనల్ నేరేషన్ అయ్యాకే నాగార్జున, మోహన్ రాజాల సినిమా ఉంటుందా లేదా అనే విషయంపై స్పష్టత వస్తుంది.