BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్‌డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!

Kiccha Sudeep 300kb

Kiccha Sudeep 300kb

BRB First Look: ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెలెబ్రేషన్స్ తెలుగు రాష్ట్రాలలో అంగరంగ వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే రోజున కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బర్త్ డేని కూడా అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈసారి పుట్టినరోజు ట్రీట్ మరింత స్పెషల్‌గా మారింది. ఇప్పటివరకు ఆయన కెరీర్‌లో చూడని విధమైన భారీ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ‘బిల్లా రంగ బాషా: ఫస్ట్ బ్లడ్’ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. సుదీప్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ చూస్తే సినిమా ఏ స్థాయిలో భారీగా ఉండబోతుందో అర్థమవుతోంది. మంచుతో కప్పబడిన ప్రాంతం, చుట్టూ విధ్వంసం, ఆకాశంలో విమానాలు, యుద్ధ యంత్రాలు, మధ్యలో బైక్‌పై సుదీప్ కనిపించే తీరు సినిమాపై ఒక్కసారిగా హైప్ పెంచేసింది.

‘విక్రాంత్ రోణ’ సినిమాతో తనదైన ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించిన దర్శకుడు అనూప్ భండారి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ‘బిల్లా రంగ బాషా: ఫస్ట్ బ్లడ్’ను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుదీప్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ రోజు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌తో ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు ఆఫీషియల్ గానే శ్రీకారం చుట్టినట్టైంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కిచ్చా సుదీప్ స్టైల్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. తీవ్రమైన చలితో మంచు గడ్డకట్టినట్టుగా కనిపించే ప్రాంతంలో ఆయన మోటార్‌సైకిల్ నడుపుతూ కనిపిస్తున్నారు. కళ్లకు గాగుల్స్, రఫ్ లుక్, సీరియస్ ఎక్స్‌ప్రెషన్‌తో సుదీప్ కనిపించారు.

ఈ సినిమా కథ క్రీస్తుశకం 2209 నాటి భవిష్యత్తు ప్రపంచం నేపథ్యంలో సాగుతుందని మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు. అంటే ప్రేక్షకులను ప్రస్తుత కాలం నుంచి పూర్తిగా భిన్నమైన ఒక ఫ్యూచరిస్టిక్ ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నారు. ఇప్పటివరకు కథకు సంబంధించిన వివరాలను మేకర్స్ సీక్రెట్ గానే ఉంచారు. దీంతో సుదీప్ ఇందులో ఎలాంటి రోల్ లో కనిపించబోతున్నారనే ఇంట్రెస్ట్ అభిమానుల్లో రోజు రోజుకి పెరిగిపోతోంది. సుదీప్ కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ స్థాయి ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘హనుమాన్’ వంటి భారీ విజువల్ ప్రాజెక్ట్‌ను నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాను నిర్మిస్తుండటంతో ఈ మూవీపై ప్రత్యేక బజ్ క్రియేట్ అవుతోంది.

ఇక రిలీజ్ విషయంలోనూ మేకర్స్ ముందుగానే తమ ప్రణాళికను వెల్లడించారు. 2027 మొదటి త్రైమాసికంలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత 2027 మూడో త్రైమాసికంలో ట్రైలర్‌తో పాటు పాటలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. చివరగా 2027 చివరి త్రైమాసికంలో ‘బిల్లా రంగ బాషా: ఫస్ట్ బ్లడ్’ను థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.