కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకొనవసరం లేదు. తెలుగులో ఈగ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు విలన్ గా పరిచయమైన ఆ తరువాత సైరా నరసింహారెడ్డి లో అద్భుతమైన పాత్రలో నటించి మెప్పించాడు. కన్నడలో స్టార్ హీరో అయినా పాత్ర నచ్చితే అతిధి పాత్రలోనైనా కనిపిస్తాడు. ఇక దీంతోనే సుదీప్ కు టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇకపోతే ప్రస్తుతం సుదీప్ విక్రాంత్ రోణ చిత్రంలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఇదంతా పక్కన పెడితే సుదీప్ తాజాగా కెజిఎఫ్ 2 సినిమాపై ప్రశంసలు వర్షం కురిపించాడు. అంతేకాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు. దీంతో ప్రస్తుతం సుదీప్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు.
తాజాగా ఆయన ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ” ఓ కన్నడ సినిమాను పాన్ ఇండియాగా రూపొందించారని అందరూ అంటున్నారు. కానీ అందులో ఒక చిన్న కరెక్షన్ హిందీ ఎంత మాత్రం జాతీయ భాష కాదు. నేడు బాలీవుడ్ ఎన్నో పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తుంది. వాటిని తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. కానీ అవి హిట్ అవుతున్నాయా అంటే లేదు. ఎంతమాత్రం అవి విజయం సాధించలేకపోతున్నాయి. కానీ.. ఈరోజు మనం తెరకెక్కిస్తున్న సినిమాలు ప్రపంచం మొత్తం చూస్తున్నాయి. ప్రపంచం మొత్తం చూసేలా సౌత్ డైరెక్టర్స్ తమ సినిమాలను రూపొందిస్తున్నారు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సుదీప్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
