మాస్ మహరాజా రవితేజ ప్రస్తుతం ఐదారు చిత్రాలను సెట్ చేశాడు. అందులో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ‘ఖిలాడీ’ ఒకటి. నిజానికి అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ సినిమా ఈ యేడాది మే 28వ తేదీన విడుదల కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ లో జాప్యం జరగడంతో రిలీజ్ పోస్ట్ పోస్ అయ్యింది. అయితే, సంక్రాంతి కానుకగా ‘క్రాక్’తో సూపర్ హిట్ ను అందుకున్న రవితేజ, ఈ ‘ఖిలాడీ’ని ఇదే యేడాది చివరిలో అయినా విడుదల చేస్తాడేమోనని అభిమానులు భావించారు. కానీ వారి అంచనాలను తల్లకిందులు చేస్తూ, మూవీ విడుదలను వచ్చే యేడాది ఫిబ్రవరి 11కు వాయిదా వేశారు. గురువారం ఈ విషయాన్ని నయా పోస్టర్ ద్వారా రవితేజ తెలిపాడు.
Read Also : పెద్ద సినిమాలకు గట్టి దెబ్బ… ఫస్ట్ ఎఫెక్ట్ బాలయ్యపైనే !
ఇటీవలే ‘ఖిలాడీ’లోని చివరి పాటను దుబాయ్ లో రవితేజ, హీరోయిన్లు మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిపై చిత్రీకరించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ విస్సాతో పాటు దేవిశ్రీ తమ్ముడు సాగర్ మాటలు రాస్తున్నాడు. రమేశ్ వర్మ దర్శకత్వంలో సత్యనారాయణ కోనేరు దీన్ని నిర్మించారు. విశేషం ఏమంటే… ఫిబ్రవరి 11న అడివి శేష్ నటిస్తున్న ‘మేజర్’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు దాని నిర్మాతలలో ఒకరైన మహేశ్ బాబు ఇప్పటికే ప్రకటించారు. సో…. ఫిబ్రవరి 11న ‘మేజర్’తో ‘ఖిలాడీ’ పోటీపడబోతున్నాడు.
