యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం’కెజిఎఫ్’. 1970ల్లో కోలార్ మైన్ గోల్డ్స్ లో పనిచేసిన కార్మికుల జీవితాల నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాంకపై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా 2018 డిసెంబర్ 20న పాన్ ఇండియా సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు దాని సీక్వెల్ ‘కెజిఎఫ్2’ ఈ నెల 14న విడుదల కాబోతోంది. ఇటీవల ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా మంచి బజ్ ఉన్న సినిమాల్లో ఇది ముందువరుసలో ఉంది.
ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో యూనిట్ ప్రచారరాన్ని ఉధృతం చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ తరహాలో నేషనల్ మీడియాపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇది కాకుండా నిర్మాతలు ఓ కొత్త ప్రయోగం చేయబోతున్నారు. కేజీఎఫ్ 2 కి హైప్ తీసుకువచ్చే పనిలో భాగంగా తొలి భాగాన్ని రీరిలీజ్ చేయాలని నిర్ణయించారు. కన్నడనాటనే కాకుండా దేశవ్యాప్తంగా కేజీఎఫ్ చాప్టర్1ని రీ-రిలీజ్ చేస్తారట. కేజీఎఫ్2 విడుదలకు ఆరు రోజుల ముందుగా ఏప్రిల్ 8న ఫస్ట్ పార్టును రిలీజ్ చేయబోతున్నారట. ఇక ఈ రీరిలీజ్ లో తొలి భాగాన్ని సబ్సిడీ ధరకి అంటే టికెట్ ధరకంటే తక్కువకే వీక్షించే అవకాశం కల్పిస్తారట. నిజానికి మంచి అయిడియానే. అయితే సెకండ్ పార్ట్ ఏమాత్రం నిరాశపరిచినా ఈ ప్రయోగం వికటించే అవకాశం లేకపోలేదంటున్నారు. రెండు భాగాల మధ్య పోలిక వచ్చి మలి భాగం కంటే తొలి భాగమే బెటర్ అనే టాక్ వస్తే పెద్ద దెబ్బ పడటం ఖాయం. మరి సీక్వెల్ తొలి భాగాన్ని మరిపించి ఘన విజయం సాధిస్తుందా!? లేక చతికిల పడుతుందా? అన్నది తేలాలంటే 14 వరకూ వెయిట్ చేయక తప్పదు. చూద్దాం ఏం జరుగుతుందో!?
