NTV Telugu Site icon

‘సలార్’ డేట్ ను కబ్జా చేసిన ‘కేజీఎఫ్ -2’!

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ‘కేజీఎఫ్ -2’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన వెంటనే టాలీవుడ్, శాండిల్ వుడ్ లో రకరకాల ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటున్న ‘కేజీఎఫ్ -2’ను ఏకంగా ఏడెనిమిది నెలలు వాయిదా వేసి, 2022 ఏప్రిల్ 14న రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమిటనేది ఒకటి కాగా, ఆ రోజున ‘కేజీఎఫ్ -2’ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ‘సలార్’ మూవీని విడుదల చేస్తానన్న ఇప్పటికే ప్రకటించారు. దాని విషయం ఏం చేస్తారన్నది మరో ప్రశ్న! ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఏమాత్రం లేని సమయంలో అంటే ఫిబ్రవరి 28న ప్రభాస్ తో తాము నిర్మించబోతున్న ‘సలార్’ మూవీని 2022 ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తామని నిర్మాణ సంస్థ ప్రకటించింది.

కరోనా సెకండ్ వేవ్ తో ప్రభాస్ సినిమాల షూటింగ్స్ అన్నీ తారుమారు అయిపోయాయి. ఈ నేపథ్యంలో ‘సలార్’ ముందు అనుకున్న తేదీకి విడుదల కావడం కష్టమనేది అందరికీ తెలిసిందే! కానీ ‘సలార్’ షూటింగ్ ఇప్పటికే పట్టాలెక్కేసింది. గట్టిగా పూర్తి చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తే… అనుకున్న తేదీకి మూవీని విడుదల చేయడం పెద్ద కష్టం కూడా కాదు. అయితే అదే రోజున ‘కేజీఎఫ్ -2’ను రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో ‘సలార్’ విడుదల తేదీ ఖచ్చితంగా వాయిదా పడుతుందనేది తెలిసిపోతోంది. ‘సలార్’కు సంబంధించి రాజమన్నార్ అప్ డేట్ ను సోమవారం 10.30కి ఇవ్వబోతున్నట్టు నిర్మాణ సంస్థ తెలిపింది. ఆ సమయంలో ‘సలార్’ రిలీజ్ డేట్ విషయమై క్లారిటీ ఇచ్చినా ఆశ్చర్య పోనక్కర్లేదు.

హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ రెండు సినిమాల కథ ఇలా ఉంటే… వచ్చే యేడాది ఏప్రిల్ 29న ఎన్టీయార్ – కొరటాల శివ సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. మరి అదే తేదీకి దానిని విడుదల చేస్తారా? లేక ‘కేజీఎఫ్ -2’కు కాస్తంత సమయం ఇవ్వాలని వీరు కూడా వెనక్కి వెళతారా అనేది చూడాలి. ఏదేమైనా… ‘కేజీఎఫ్ -2’ విడుదల తేదీ ప్రకటనతో చాలామంది భారీ చిత్రాల నిర్మాతలు పునరాలోచనలో పడ్డారు!