Katharine Hepburn: నేడు ‘ఆస్కార్ అవార్డు’ అన్న పేరు పాశ్చాత్య దేశాల్లో కన్నా మిన్నగా మన దేశంలో వినిపిస్తోంది. ఒకప్పుడు ‘ఆస్కార్’ అవార్డులు మనవి కావులే అనే ఉద్దేశంతో ఉండేవారు భారతీయులు. ఈ యేడాది భారతీయులు ఆస్కార్ బరిలోనూ సందడి చేయడంతో మన సినీఫ్యాన్స్ లో అకాడమీ అవార్డుల పేరు వింటే చాలు ఉత్సాహం ఉరకలు వేస్తోంది. అలాంటి ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల్లో నాలుగు సార్లు ఉత్తమ నటిగా నిలచి చరిత్ర సృష్టించారు ప్రఖ్యాత హాలీవుడ్ నటి కేథరిన్ హెబ్బర్న్. మే 12న కేథరిన్ హెబ్బర్న్ 116వ జయంతి సాగనుంది. ఈ నేపథ్యంలో కేథరిన్ అభిమానులు, సన్నిహితులు ఆమెను తలచుకుంటూ మే 12న కేథరిన్ మరపురాని నటనతో సాగిన చిత్రాలను వీక్షించనున్నారు. దాదాపు ఆరు దశాబ్దాలు అమెరికా సినిమారంగంలో తనదైన బాణీ పలికించిన కేథరిన్ హెబ్బర్న్ వ్యక్తిగానూ తనదైన శైలి ప్రదర్శించారు. ముక్కుసూటితనంతో మనసులో ఏదీ దాచుకోకుండా కుండబద్దలు కొట్టి మాట్లాడే కేథరిన్ ను కొందరు ‘హెడ్ స్ట్రాంగ్’ అన్నారు; మరికొందరు అంత అద్భుతమైన నటికి ఆ మాత్రం ఉండకపోతే ఎలా అనీ అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా తనదైన పంథాలో పయనిస్తూ 96 ఏళ్ళ నిండు జీవితం గడిపి, జనం మదిలో నటిగా, వ్యక్తిగా తనదైన ముద్ర వేశారు కేథరిన్ హెబ్బర్న్.
కేథరిన్ పూర్తి పేరు కేథరిన్ హోటన్ హెబ్బర్న్. 1907 మే 12న కనెక్టికట్ హార్ట్ ఫోర్డ్ లో ఆమె జన్మించారు. ఆమె తండ్రి థామస్ నార్వల్ హెబ్బర్న్ హార్ట్ ఫోర్డ్ హాస్పిటలో యూరాలజిస్ట్ గా పనిచేసేవారు. తల్లి కేథరిన్ మార్తా హోటన్ హెబ్బర్న్ సమాజసేవకురాలు. సంఘంలో మహిళలకు జరిగే అన్యాయాలను ఎదిరిస్తూ ఎందరిలోనో స్ఫూర్తి నింపారు. కేథరిన్ కన్నవారికి ఆరుగురు సంతానం. కేథరిన్ రెండో బిడ్డ. ఆమె తల్లిదండ్రులిద్దరూ సామాన్యుల పక్షం నిలచి పోరాటాలు సాగించిన వారే. ఆ రోజుల్లోనే వారి పేర్లు అమెరికాలో మారుమోగిపోయేవి. ముఖ్యంగా కేథరిన్ తల్లి ‘ఓట్స్ ఫర్ విమెన్’ అంటూ చేసిన పోరాటం చరిత్రలో నిలచిపోయింది. కొన్నిసార్లు తల్లితో కలసి కేథరిన్ సైతం ఉద్యమాల్లో పాల్గొన్నారు. కేథరిన్ చిన్నప్పుడు ‘మగరాయుడు’లా తిరిగేవారు. అచ్చు మగపిల్లాడిలాగే తయారయ్యేవారు. చిన్నతనంలో స్కూల్ వెళ్ళాలంటే కేథరిన్ మారాం చేసేది. చాలా ఏళ్ళు ఇంట్లోనే చదువుకుంది. చివరకు తన తల్లి కోరిక మేరకు ఆమె చదివిన ‘బ్రైన్ మార్ కాలేజ్’లో కేథరిన్ చేరారు. అక్కడే చాలా ఏళ్ళు చదివారు. ఓ సారి రూమ్ లో సిగరెట్ తాగి, అధ్యాపకుల ఆగ్రహానికీ గురయ్యారు కేథరిన్. అక్కడ చదివే రోజుల్లోనే కేథరిన్ మనసు నటనపై ఆసక్తి పెంచుకుంది. కాలేజ్ లోనూ, ఉత్సవాల్లోనూ నాటకాల్లో నటిస్తూ సాగారామె. 1928లో హిస్టరీ, ఫిలాసఫీలో డిగ్రీ పొందారామె.
Read Also: Off The Record: టి.బీజేపీలో కొత్త టెన్షన్.. కర్ణాటక ఫలితం ఏంటో..?
పట్టా పుచ్చుకున్న మరుసటి రోజునే కేథరిన్ నటి కావాలన్న అభిలాషతో బాల్టిమోర్ బయలు దేరింది. అక్కడ ప్రముఖ దర్శకనిర్మాత ఎడ్విన్ హెచ్.నాఫ్ ను కలుసుకుంది. ఆయన కేథరిన్ ఉత్సాహానికి ముగ్ధుడై తన ‘ద సిజరినా’లో ఓ చిన్న పాత్ర ఇచ్చారు. ఆ పాత్రతోనే నటిగా మంచి మార్కులు సంపాదించారు కేథరిన్. జార్జ్ కుకర్ రూపొందించిన ‘ఎ బిల్ ఆఫ్ డైవర్స్ మెంట్’లో తొలిసారి నాయికగా నటించారామె. కేథరిన్ నటించిన మూడో చిత్రం ‘మార్నింగ్ గ్లోరీ’ (1933)తోనే ఉత్తమనటిగా ఆమెకు ఆస్కార్ అవార్డు లభించడం విశేషం! ఆపై కేథరిన్ మరి వెనుదిరిగి చూసుకోలేదు. ఆ రోజుల్లో ఎంతోమంది కలలరాణిగా రాజ్యం చేశారామె. 1968లో ‘గెస్ హూజ్ కమింగ్ టు డిన్నర్’ సినిమాతో రెండోసారి ఉత్తమ నటిగా అకాడమీ అవార్డు అందుకున్నారు. మరుసటి సంవత్సరమే 1969లో ‘ద లయన్ ఇన్ వింటర్’తో మూడోసారి ఉత్తమ నటిగా ఆస్కార్ ను చేజిక్కించుకున్నారు. 1982లో ‘ఆన్ గోల్డెన్ పాండ్’తో నాలుగో ఆస్కార్ ను సొంతం చేసుకున్నారామె. 12 సార్లు ఆస్కార్ నామినేషన్స్ పొంది, నాలుగు సార్లు విజేతగా నిలచారు. నాలుగు సార్లు ఉత్తమ నటిగా ఆస్కార్ అందుకున్న ఏకైక నటిగా ఈ నాటికీ నిలచే ఉన్నారు కేథరిన్ హెబ్బర్న్!
విలక్షణమైన అభినయంతో అలరించిన కేథరిన్ హెబ్బర్న్ నిజజీవితంలోనూ అలాగే సాగారు. చదువుకొనే రోజుల్లో పరిచయం అయిన లడ్లో ఆగ్డెన్ స్మిత్ ను 1928లో తన పందొమ్మిదవ ఏటనే పెళ్ళాడింది. లడ్లో ఆమె పేరును కేట్ స్మిత్ గా మార్చారు. ఆరేళ్ళు కాపురం చేసిన తరువాత 1934లో విడిపోయారు. ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డుల్లో చరిత్ర సృష్టించిన స్పెన్సర్ ట్రేసీతో సహజీవనం చేశారు కేథరిన్. స్పెన్సర్ ట్రేసీ 1937లో ‘కెప్టెన్స్ కరేజియస్’తోనూ, 1938లో ‘బాయ్స్ టౌన్’తోనూ వరుసగా రెండేళ్ళు ఉత్తమ నటునిగా ఆస్కార్ అందుకున్న తొలి నటునిగా చరిత్ర సృష్టించారు. 1941 నుండి 1967 వరకు స్పెన్సర్ తో కేథరిన్ గడిపారు. స్పెన్సర్ ట్రేసీతో విడిపోయాకే అంటే 1968,1969 సంవత్సరాల్లో కేథరిన్ సైతం ఉత్తమ నటిగా వరుసగా రెండు ఆస్కార్లు అందుకొని చరిత్ర సృష్టించారు. ఇలా తనకు సరైన జోడీతోనే ఇంతకాలం కాపురం చేశానని స్పెన్సర్ గొప్పగా చెప్పుకుంటే, ‘ఆ అదృష్టం నీకు కలిగించింది నేనేగా’ అంటూ కేథరిన్ తనదైన పంథాలో అన్నారు. ఆ తరువాత కూడా కేథరిన్, స్పెన్సర్ ఇద్దరూ మంచి స్నేహితులుగా సాగడం విశేషం!ఈ తీరున ఆస్కార్ చరిత్రలో చెరిగిపోని రికార్డు సృష్టించిన కేథరిన్ హెబ్బర్న్ 116వ జయంతి నిజంగానే ఆమె అభిమానులకు, సన్నిహితులకు ఓ పర్వదినమనే చెప్పాలి.
Read Also: Off The Record: తమ్మినేని హంగామా అంతా పైపై డాంబికమేనా?