జేమ్స్ కేమరాన్ అద్భుత ప్రేమకావ్యం ‘టైటానిక్’ చూసిన వారెవరైనా సరే అందులో నాయికపై మనసు పారేసుకోవలసిందే! అందులో రోజ్ డివిట్ బుకెటర్ పాత్రలో కేట్ విన్స్ లెట్ ఒదిగిపోయారు. ఆమె అభినయం, అందం అయస్కాంతంలా కుర్రాళ్ళను ఆకర్షించాయి. దాంతో పదే పదే కేట్ ను చూడటానికే ‘టైటానిక్’కు పరుగులు తీశారు రసికాగ్రేసరులు. ఇప్పటి దాకా మూడు సార్లు ‘బ్రిటిష్ అకాడమీ ఫిలిమ్ అండ్ టెలివిజన్ అవార్డ్స్’ (బి.ఎ.ఎఫ్.టి.ఏ.) అందుకున్న కేట్ విన్ స్లెట్ ఐదో సారి ‘ఐ యామ్ రూత్’ అనే టీవీ సిరీస్ తో ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. టీవీ సిరీస్ లో బ్రిటిష్ అకాడమీ అవార్డు అందుకోవడం కేట్ కు ఇదే మొదటి సారి. గతంలో “సెన్స్ అండ్ సెన్సిబులిటీ, ద రీడర్, స్టీవ్ జాబ్స్” చిత్రాల ద్వారా కేట్ బ్రిటిష్ అకాడమీ అవార్డులు సొంతం చేసుకున్నారు. కాగా, ‘ఐ యామ్ రూత్’ సిరీస్ లో ‘బెస్ట్ సింగిల్ డ్రామా’ అవార్డునూ కేట్ విన్ స్లెట్ చేజిక్కించుకోవడం విశేషం! ఒకే సారి రెండు బ్రిటిష్ అకాడమీ అవార్డులు సొంతం చేసుకున్న కేట్ ఆనందం అంబరమంటుతోంది.
‘ఐ యామ్ రూత్’ సిరీస్ లో కేట్ సొంత కూతురు మియా థ్రిపుల్ టన్ నిజజీవిత పాత్రలోనే నటించింది. అంటే అందులో కేట్ కన్నకూతురుగానే మియా అభినయించింది. ‘ఐ యామ్ రూత్’ సిరీస్ ముఖ్యంగా చిన్నపిల్లలు మళ్ళీ టీవీ చూసేలా చేస్తోందని కేట్ అన్నారు. ఓ మంచి ప్రయత్నం ద్వారా అవార్డు లభించడం ఆనందంగా ఉందని కేట్ చెబుతున్నారు. ఈ అవార్డు తనకు రాకపోయినా, తన కూతురు మియాకు తప్పకుండా వచ్చేదని కేట్ తల్లి మనసు ఆశిస్తోంది. మియా తనకంటే అద్భుతంగా నటిస్తోందని, నిజానికి ఆమెతో పోటీ పడడం తనకే వీలు కావడం లేదనీ కేట్ విన్ స్లెట్ అంటున్నారు. ఎంతయినా మాతృ హృదయం కదా! ఏమైనా మియా రూపంలో ఓ అందాలభామ చిత్రసీమకు లభించినట్టే అని సినీపరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి మియాను కేట్ ఏ తీరున తీర్చిదిద్దుతారో చూడాలి.
