Karthikeya 2 gets postponed again?
రెండు మూడు రోజులుగా టాలీవుడ్ లో ‘కార్తికేయ-2’ రిలీజ్ కు సంబంధించి రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. ‘కార్తికేయ -2’ చిత్రాన్ని ముందు అనుకున్నట్టుగా ఈ నెల 12న కాకుండా, ఒక రోజు వెనక్కి వెళ్ళి 13న రాబోతోంది. 12వ తేదీ నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ విడుదల కాబోతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ బరిలో క్లాష్ వద్దనుకుని ఈ సినిమాను ఒకరోజు వెనక్కి తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది.
ఈ నెల 11న ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ విడుదల కాబోతుండగా, 12న ‘మాచర్ల నియోజకవర్గం’ వస్తోంది. ఇక 13వ తేదీని ‘కార్తికేయ-2’ రిలీజ్ అవుతోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం మీడియా మీట్ లో అధికారికంగా ప్రకటించింది. ఈ సమావేశంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ, ”మంచి కాన్సెప్ట్ తో, ఎక్సాటార్డినరీ విజువల్స్ తో తీసిన సినిమా ఇది. ఈ నెల 13న దీన్ని విడుదల చేస్తున్నాం” అని అన్నారు. మరో నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ, ”కృష్ణుడి జీవితం మీద తెరకెక్కిన చిత్రమిది. కృష్ణుడు ఉన్నాడన్నది వాస్తవం. దానినే ఈ సినిమాలో చూపించాం. అందుకే ‘కృష్ణ ఈజ్ ట్రూత్’ అనేది మా సినిమాకు హ్యాష్ ట్యాగ్ గా పెట్టుకున్నాం” అని అన్నారు. చందు మొండేటి మాట్లాడుతూ, “ఈ కాన్సెప్ట్ ను నమ్మి, చక్కగా తెరకెక్కించాం. దీన్నిజనంలోకి తీసుకెళ్ళే బాధ్యత ఇక మీడియాదే” అని చెప్పారు. హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ, ”ఇది ఐదేళ్ళ పిల్లాడి నుండి 60 యేళ్ళ పెద్దవాళ్ళ వరకూ అందరికీ నచ్చే సినిమా. దీనిని థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి. ఎన్నో సార్లు ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఖచ్చితంగా 13న వస్తున్నాం. లేట్ గా వస్తున్నా… లేటెస్ట్ గా రాబోతున్నాం” అని తెలిపింది.
చివరగా హీరో నిఖిల్ మాట్లాడుతూ, ”సినిమా విడుదల అనేకసార్లు వాయిదా పడినా, ఎక్కడా నిరుత్సాహ పడకుండా మూవీ టీమ్, ప్రేక్షకులు మాకు దన్నుగా నిలిచారు. ఈ సినిమా మొదలైన తర్వాత రెండు పాండమిక్స్ ను ఎదుర్కొన్నాం. ఎంతో కష్టపడి దీనిని పూర్తి చేశాం. ఇవాళ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తున్న సమయంలో ఎంతో మంది మాకు సపోర్ట్ చేయడం ఆనందంగా ఉంది. ఇది థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ను అందించే సినిమా. అందుకే ఇప్పట్లో ఓటీటీలో తీసుకొచ్చే ఆలోచన కూడా మేం చేయడం లేదు” అని చెప్పారు. ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను 6వ తేదీ విడుదల చేయబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మూవీ యూనిట్ తో పాటు కో-ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ట కూడా పాల్గొన్నారు.