Site icon NTV Telugu

Kangana : హీరోల వేధింపులకు డైరెక్టర్లు బలి.. బాలీవుడ్ బండారం బయటపెట్టిన కంగనా.

Kangana

Kangana

బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమలో దర్శకులకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తిన ఆమె, ఈ క్రమంలో సూపర్ స్టార్ల తీరును తప్పుబట్టారు. తాజాగా విడుదలైన ‘ధురంధర్ 2’ సాధిస్తున్న అఖండ విజయంపై స్పందిస్తూ, దర్శకుడు ఆదిత్య ధర్ ప్రతిభను కొనియాడుతూ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్‌లు పెట్టారు. హాలీవుడ్‌లో స్టీవెన్ స్పీల్‌బర్గ్, క్వింటిన్ టరాన్టినో, క్రిస్టోఫర్ నోలన్ వంటి దర్శకులకు అక్కడి అగ్ర హీరోల కంటే ఎక్కువ గౌరవం, గుర్తింపు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. కానీ, భారతీయ చిత్ర పరిశ్రమలో మాత్రం దర్శకులకు సరైన క్రెడిట్ దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:Dhurandhar 2: సొంత భర్త సినిమాకు రాని దీపిక.. అసలేం జరుగుతోంది!

మన ఇండస్ట్రీలో దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులు విపరీతమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, వారికి ఇచ్చే రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువని కంగనా ఆరోపించారు. ఇక్కడి సూపర్ స్టార్లు దర్శకులను వేధిస్తారని, దానివల్ల కొత్తగా వచ్చే యువత కేవలం నటులు కావాలని అనుకుంటున్నారే తప్ప, డైరెక్టర్లు లేదా సినిమాటోగ్రాఫర్లు కావాలని కలలు కనడం లేదని ఆమె విశ్లేషించారు. “ధురంధర్ 2 విజయంతో ఆదిత్య ధర్ ఒక సూపర్ స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు. ఏ హీరో కంటే తక్కువ కాకుండా ఆయన మెరుస్తున్నారు. ఇది చూసి భవిష్యత్తులో ఎంతోమంది యువత దర్శకులు కావాలని ఆశిస్తారు” అని కంగనా పేర్కొన్నారు. ఆదిత్య ధర్ సినిమా విజయాన్ని ఆకాశానికెత్తిన కంగనా, తన పోస్ట్‌లో ఎక్కడా హీరో రణవీర్ సింగ్ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. కేవలం దర్శకుడిని మాత్రమే ట్యాగ్ చేస్తూ ఆమె ప్రశంసలు కురిపించారు.

Exit mobile version