Site icon NTV Telugu

Kamini Kaushal: బాలీవుడ్ హీరోయిన్ కన్నుమూత..

Kamini Kaushal Death

Kamini Kaushal Death

బాలీవుడ్ తొలి తరం హీరోయిన్‌ల్లో తనదైన రేంజ్‌లో పేరు తెచ్చుకున్న సీనియర్ నటి కామినీ కౌశల్ (98) ఇక లేరు.  ముంబయిలోని తన ఇంట్లో ఆమె చివరి శ్వాస విడిచారు. లాహోర్‌లో జన్మించిన కామినీ అసలు పేరు ఉమా కశ్యప్. చిన్నప్పటి నుంచి రేడియో నాటకాలతో ప్రజలను ఆకట్టుకున్న ఆమెను.. దర్శకుడు చేతన్ ఆనంద్ 1946లో ‘నీచా నగర్’ అనే సినిమాతో వెండితెరకు పరిచయం చేశారు. ఇదే సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకోవడం అప్పట్లో సెన్సేషన్. ఆ తర్వాత కామినీ వరుసగా ఏడాదికి ఐదు ఆరు సినిమాలతో బిజీ అయిపోయారు. దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్, రాజ్ కపూర్, అశోక్ కుమార్ లాంటి టాప్ హీరోల సరసన నటించి 40లలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరిగా నిలిచారు.

Also Read : Rajinikanth-kamal : రజనీ – కమల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కోసం.. టాలీవుడ్‌లో వేట ?

ఆగ్, దో భాయ్, నదియా కే పార్, అర్జూ లాంటి ఎన్నో సినిమాలు బ్లాక్‌బస్టర్లయ్యాయి. హీరోయిన్‌గా 1963 వరకు రాణించిన ఆమె తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మరో ఇన్నింగ్స్ మొదలుపెట్టి దో రాస్తే, పురబ్ ఔర్ పశ్చిమ, రోటీ కపడా ఔర్ మకాన్ సినిమాల్లో తల్లి పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నారు. షారుక్ ఖాన్ చెన్నై ఎక్స్‌ప్రెస్లో అమ్మమ్మగా, ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ లో అతిథి పాత్రలో కనిపించి కొత్త తరం ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వ్యక్తిగత జీవితంలో కూడా కామినీ కౌశల్ ఎంతో ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. తన అక్క మరణంతో..

ఇద్దరు చిన్నారుల బాధ్యత తనపై పడినప్పుడు, వారిని చూసుకోవడం కోసం ఆమె అక్క భర్తను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు పుట్టారు. నటనతో పాటు పిల్లల కోసం ఎన్నో కథలు రాసి పరాగ్ పత్రికలో ప్రచురించుకున్నారు. అలాగే తన బ్యానర్ గుడియా ఘర్ ప్రొడక్షన్స్ ద్వారా పిల్లల కోసం తోలుబొమ్మలతో ఎన్నో టీవీ కార్యక్రమాలు చేశారు. నటిగా, మహిళగా, కళాకారిణిగా, క్రమశిక్షణతో జీవించిన కామినీ కి ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ సహా అనేక పురస్కారాలు దక్కాయి. ఆమె మరణాన్ని పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ, “హిందీ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే నక్షత్రం ఆరిపోయింది” అని భావోద్వేగంగా గుర్తు చేసుకుంటున్నారు.

Exit mobile version